సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి మండి పడుతున్న రైతులు …
దొడ్డు వడ్లను ఎఫ్‌సీఐ ఎలాగూ కొంటది సన్నవడ్లకే బోనస్ ఇచ్చి కొంటం చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డిదొడ్డు ధాన్యం రైతులకు సున్నమే…!
రాష్ట్రంలో ఎక్కువగా దొడ్డు వడ్లే సాగు నిన్నటిదాకా బోనస్ అంటూ గొప్పలు తీరా ఇప్పుడు సన్నాలకేనని మెలిక సర్కారుపై మండిపడుతున్న రైతులు.
ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తున్నదా? ఆ పార్టీ మాటలు నమ్మిన రైతుల ఆశలు ఆడియాసలే కానున్నాయా?’ అంటే ‘అవును’ అనేదే సమాధానం! నిన్నమొన్నటిదాకా ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు అంతా తూచ్ అని చెప్పకనే చెప్పింది. ‘ఓట్ల ముందు ఓడ మల్లన్న..
ఓట్లయ్యాక బోడి మల్లన్న’ అన్నట్లుగా రెండు ఎన్నికలు ముగిశాక ఇప్పుడు కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని సూత్రప్రాయంగా ప్రకటించి దొడ్డు వడ్లు పండించే రైతులకు ‘చెయ్యి’చ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మంగళవారం నిర్వహించిన చిట్‌చాట్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ ‘సన్నవడ్లు పండించే రైతులకు దిగుబడి తగ్గి, ఖర్చు ఎక్కువై నష్టాలు వస్తున్నయ్. కాబట్టే రైతులెవరూ సన్నవడ్ల సాగుకు ముందుకు రావడం లేదు. అందుకే సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తే రైతులు సన్నాల సాగుకు ముందుకొస్తారు.
ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి రేషన్ షాపుల్లో ప్రజలకు సన్నబియ్యం అందిస్తం’ అని చెప్పారు. ఇదే సందర్భంలో ‘రాష్ట్రంలో ఎక్కువ రైతులు దొడ్డు వడ్లే పండిస్తారు కదా’ అని విలేకరులు ప్రశ్నించగా ‘దొడ్లు వడ్లను ఎలాగూ ఎఫ్‌సీఐ కొంటుంది కదా’ అని సీఎం సమాధానమిచ్చినట్టు తెలిసింది. దీంతో కాంగ్రెస్ ప్రకటించిన బోనస్ హామీ ఉత్త బోగసేనని, సన్న వడ్లకు బోనస్ ఇచ్చి దొడ్డు ధాన్యం రైతులకు ఇవ్వకుంటే వారి పొట్టకొట్టినట్టేనన్న చర్చ కొనసాగుతున్నది.
తప్పించుకునేందుకేనా..?
కాంగ్రెస్ ఇచ్చిన బోనస్ హామీ ప్రభుత్వానికి ఆర్థికంగా భారమవుతుందన్న కారణంతోనే తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే సన్నవడ్లు, దొడ్డు వడ్లు అంటూ కొత్త నాటకానికి తెరతీసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏటా వానకాలం, యాసంగి కలిపి సుమారు 1.20 కోట్ల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఏటా కోటి టన్నులకు పైగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఈ లెక్కన కోటి టన్నులకు బోనస్ ఇవ్వాల్సి వస్తే ఏటా సుమారు రూ. 5-7వేల కోట్ల దాకా ప్రభుత్వంపై భారం పడే అవకాశముంది. కేవలం సన్నాలకే బోనస్ ఇవ్వాల్సి వస్తే మిల్లర్లు, వ్యాపారుల కొనుగోళ్లు, రైతుల అవసరాలు పోను కేవలం 10-20 లక్షల టన్నులకన్నా ఎక్కువ కొనే పరిస్థితి ఉండదు. ఇలా అయితే కేవలం రూ. వెయ్యి కోట్లతో కథ ముగిసిపోతుంది. అందుకే ఈ మెలిక పెడుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
దొడ్డు వడ్ల సాగే ఎక్కువ..
రాష్ట్రంలో వానకాలమైనా, యాసంగి అయినా దొడ్డు వడ్లే ఎక్కువ సాగవుతాయి. సన్నవడ్ల సాగు తక్కువ ఉంటుంది. అదీ కొన్ని ప్రాంతాలకే పరిమితం. సాధారణంగా వానకాలంలో 30-40శాతం సన్నాలు, 60-70శాతం దొడ్డు వడ్లను రైతులు సాగు చేస్తారు. యాసంగిలో సన్నాలు కేవలం 10-15శాతం, దొడ్డు వడ్లు 90శాతం సాగవుతాయి. కేవలం ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, వరంగల్‌లోనే సన్నవడ్లు సాగవుతుండగా, మిగిలిన జిల్లాల్లో రైతులు తమ ఇంటి అవసరాల కోసమే పండిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సన్న వడ్లకే బోనస్ ఇస్తామంటే దొడ్డు వడ్లు పండించే రైతుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తాం… ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు మాట
వానకాలం నుంచి ధాన్యానికి బోనస్ ఇస్తాం… ఇది లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోని మాట
ఇప్పుడే అధికారంలోకి వచ్చినం.. ఈ యాసంగిలో బోనస్ ఇవ్వలేం.. – ఇది అధికారంలోకొచ్చిన తర్వాత మాట.
సన్న ధాన్యానికే బోనస్ ఇస్తాం… ఇదీ.. సీఎం రేవంత్‌రెడ్డి తాజా మాట.