BJPకి బాయ్ కాట్‌ భయం… పంజాబ్‌, హర్యానా గ్రామాల్లో రైతు నిరసనల ఎఫెక్ట్‌

BJPకి బాయ్ కాట్‌ భయం… పంజాబ్‌, హర్యానా గ్రామాల్లో రైతు నిరసనల ఎఫెక్ట్‌

ఎక్కడికక్కడ నల్లజెండాలు, నినాదాలతో నాయకులను అడ్డుకుంటున్న వైనం కాషాయపార్టీకి గ్రామీణ ఓటర్ల నుంచి ఎదురుదెబ్బ తగిలే అవకాశం : రాజకీయ విశ్లేషకులు.

చండీగఢ్‌ :

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్‌, హర్యానాల్లో రైతుల నుంచి బిజెపికి మరో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తున్నది. ఈ సారి ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ఓటు ఆ పార్టీకి మరోసారి వచ్చే అవకాశాలు కనిపించటం లేదనీ, ఇది కాషాయదళానికి రాజకీయంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కనీసం మద్దతు ధర(ఎంఎస్‌పి) కోసం చట్టపరమైన హామీని కోరుతూ ఈ రెండు రాష్ట్రాల రైతులు ఇప్పటికే పోరాటాలు చేశారు. కానీ, మోడీ సర్కారు నుంచి ఇప్పటికీ ఎలాంటి సానుకూల నిర్ణయమూ రాకపోవటం రైతుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.

లోక్‌సభ ఎన్నికలు జరగనున్న ఈ రెండు రాష్ట్రాల్లో దాని పర్యవసానాలను బిజెపి నాయకులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. జూన్‌ 1న ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లోని గ్రామాల్లోకి పార్టీ అభ్యర్థులను రాకుండా ఆగ్రహించిన రైతులు అడ్డుకుంటున్నారు. పొరుగున ఉన్న హర్యానాలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్‌లోని మాల్వా, మఝా బెల్ట్‌లలో గ్రామాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన తమ పార్టీ నాయకులకు నల్లజెండాలు చూపారని రాష్ట్ర బిజెపి చీఫ్‌ సునీల్‌ జాఖర్‌ మే 6న ప్రధాన ఎన్నికల అధికారి సి. సిబిన్‌కు ఫిర్యాదు చేశారు. భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వం ప్రచారం చేసే హక్కును కల్పించటంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. హర్యానాలో గత వారం, కోపోద్రిక్తులైన రైతులు బిజెపి సోనిపట్‌ అభ్యర్థి మోహన్‌ లాల్‌ బడోలీ ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. అశోక్‌ తన్వర్‌ (సిర్సా), రంజిత్‌ చౌతాలా (హిసార్‌), అరవింద్‌ శర్మ (రోV్ాతక్‌), మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌

లాల్‌ ఖట్టర్‌ (కర్నాల్‌) వంటి ఇతర బిజెపి అభ్యర్థులు రైతుల నుంచి నల్ల జెండాలు, నినాదాలను ఎదుర్కొన్నారు.
బిజెపికి రైతు నిరసనల ఎఫెక్ట్‌తో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ధరంపాల్‌ గోంధేర్‌ (నీలోఖేరి), రణధీర్‌ గోలన్‌ (పుండ్రి), సోంబీర్‌ సాంగ్వాన్‌ (దాద్రీ) కాంగ్రెస్‌లోకి వెళ్లారు. వారి మార్పు రాష్ట్రంలో నయాబ్‌ సింగ్‌ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి సంక్షోభాన్ని రేకెత్తించింది. బీజేపీని బహిష్కరించాలని పిలుపునిచ్చే పోస్టర్లు మార్చి చివరిలో మాల్వా గ్రామాల్లో కనిపించడం ప్రారంభించాయి. అయితే, ప్రస్తుత ఆందోళనకు 2020 వ్యవసాయ ఆందోళనకు నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా చీలిక బృందం నాయకత్వం వహిస్తుండటంతో అది ఇంతటి తీవ్రతకు దారి తీస్తుందని ఎవరూ ఊహించలేదు.

అమృత్‌సర్‌ బీజేపీ అభ్యర్థి, మాజీ దౌత్యవేత్త తరంజిత్‌ సింగ్‌ సంధుకు ఏప్రిల్‌ 6న అజ్నాలా గ్రామీణ ప్రాంతంలో రైతులు నల్ల జెండాలు చూపారు. లూథియానా నుంచి ఇప్పుడు అదే స్థానం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టు కూడా రైతుల ఆగ్రహానికి గురయ్యారు.

ఒకప్పటి మిత్రపక్షమైన శిరోమణి అకాళీదళ్‌(ఎస్ఏడీ)కి గ్రామీణ ప్రాంతాల్లో బలం ఉన్నది. అయితే, వివాదాస్పద వ్యవసాయ చట్టాల కారణంగా బిజెపితో ఎస్ఎడికి మధ్య పొత్తు బీటలువారింది. దీంతో బీజేపీకి పంజాబ్‌తో పాటు హర్యానాలోని గ్రామీణ ప్రాంతాల్లోని ఓటు కీలకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పంజాబ్‌ రాష్ట్ర జనాభాలో 67.4 శాతం మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. 37.5 శాతం మంది మాత్రమే నగరాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. గత దశాబ్దంలో పట్టణ జనాభా గణనీయంగా పెరిగినప్పటికీ.. ఓటర్లు గ్రామీణ ప్రాంతాల్లోనే గణనీయంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రైతు నిరసనల నేపథ్యంలో బీజేపీకి గ్రామీణ ప్రాంత ఓటరు నుంచి ఎదురుదెబ్బ తగిలే అవకాశమున్నదని వారు అంచనా వేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అకాళీల పొత్తులో భాగంగా 13 సీట్లలో రెండింటినీ, 9.7 శాతం ఓట్‌ షేర్‌ను సాధించింది. వ్యవసాయ ఆందోళన, దాని విభజన తర్వాత 2022 అసెంబ్లీ ఎన్నికలలో, అది 117 సీట్లలో రెండింటిని గెలుచుకున్నది. దాని ఓట్ల శాతం 6.7 శాతానికి పడిపోయింది.