ఉపాధ్యాయుల బదిలీలకు సర్కార్ అంగీకారం..

ఉపాధ్యాయుల బదిలీలకు సర్కార్ అంగీకారం..

హైదరాబాద్‌ :

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, బదిలీ అయిన వారి రిలీవ్‌కు షెడ్యూల్‌ విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.

గురువారం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం సీఎంను కలిసి పాఠశాలల పునః ప్రారంభానికి ముందే విద్యారంగ సమస్యలు పరిషరించాలని కోరామని పేర్కొన్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించి నిర్దిష్టమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని సీఎం ఫోన్‌ ద్వారా ఆదేశించారని తెలిపారు.

తర్వాత సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంను కలిసి చర్చించినట్టు తెలిపారు. తమ ప్రతిపాదనలకు కార్యదర్శి అంగీకారం తెలిపారని, ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని బదిలీ అయి రిలీవ్‌ కాకుండా ఉన్న ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేస్తామన్నారని తెలిపారు. సీఎం సూచన మేరకు సబంధిత శాఖల అధికారులతో చర్చిస్తానని తెలిపారని పేర్కొన్నారు. ఢిల్లీ మాడల్‌ను తెలంగాణలో అమలు జరపాలన్న తమ వినతి మేరకు ఉపాధ్యాయ సంఘాల నేతలను పాఠశాలల సందర్శనకు ఢిల్లీ తీసుకెళ్లే ఆలోచన ఉందని తెలిపారని పేర్కొన్నారు. సమావేశంలో యూఎస్పీసీ, జాక్టో నాయకులు కే జంగయ్య, వై అశోక్‌ కుమార్‌, టీ లింగారెడ్డి, సదానందంగౌడ్‌ పాల్గొన్నారు.

విద్యాశాఖ ఉన్నతాధికారులపై చర్య తీసుకోవాలి: పీఆర్‌టీయూటీఎస్‌

టెట్‌ విషయంలో సరైన సమాచారాన్ని అందించకుండా ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేసిన పాఠశాల విద్యా కమిషనర్‌ దేవసేన, అదనపు సంచాలకులు లింగయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పీఆర్‌టీయూటీఎస్‌ డిమాండ్‌ చేసింది. కార్యాలయంలో అందుబాటులో ఉండకుండా ఉపాధ్యాయ సమస్యలను పట్టించుకోకుండా పలు అక్రమాలకు పాల్పడిన వీరిపై విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని గురువారం విద్యాశాఖ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆ సంఘం నేతలు కోరారు. గతంలో నిలిచిపోయిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ కోరారు.