పంట బీమాకు బయోమెట్రిక్
ధ్రువీకరణ కోసం రైతుల నుంచి బయోమెట్రిక్ సేకరణ… పంట రకం పక్కాగా ఉండేందుకే..
రైతులతో డిక్లరేషన్ తీసుకున్నాకే ఇన్సూరెన్స్ చేసే యోచన ఉచిత పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ కసరత్తు
హైదరాబాద్ :
రానున్న వానాకాలం నుంచి రాష్ట్రంలో అమలుచేయనున్న ఉచిత పంటల బీమా పథకంపై వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో పంటల బీమా పథకాలు ఎలా అమలవుతున్నాయి? ఇక్కడ పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా ఎలా అమలుచేయాలి? అనే అంశాలపై రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్‌లోని క్రాప్ ఇన్సురెన్స్ విభాగం అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే సాగుచేసిన పంటల ధ్రువీకరణకు రైతుల బయోమెట్రిక్ తీసుకోవాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయశాఖ క్రాప్ బుకింగ్ పోర్టల్‌ను పకడ్బందీగా అమలుచేస్తోంది. మండలాలను క్లస్టర్లుగా విభజించి.. ఏఈవోలతో క్రాప్ బుకింగ్ చేయిస్తున్నారు. అది ఏ సర్వే నంబరు? అక్కడ ఏ పంట వేశారు? పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు, రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లు ప్రారంభమైన మొదటి రోజు నుంచి పంటల సాగు ముగిసే చివరి రోజు వరకు క్రాప్ బుకింగ్ చేస్తున్నారు.
ప్రతి ఏఈవో… తన దగ్గర ఉన్న ట్యాబ్‌లో పంటల సాగు వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ మేరకు ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగైంది? సుమారు ఉత్పత్తి ఎంత వస్తోంది? పంటల కొనుగోళ్లు చేపడితే… ఏర్పాట్లు ఏమేరకు చేయాలి? అనే అంశాలపై అవగాహనకు క్రాప్ బుకింగ్ యాప్ ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటివరకు ఈ యాప్‌ను ఏఈవోలే నిర్వహిస్తున్నారు. ఉచిత పంటల బీమా పథకాన్ని అమలుచేయటానికి క్రాప్ బుకింగ్ పోర్టల్‌లో నమోదైన విస్తీర్ణాన్నే పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పటికే వ్యవసాయశాఖ నిర్ణయించింది. అయితే ఏ పంటలు వేశారో నిర్ధారించుకోవటానికి మాత్రం రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటే మేలనే అభిప్రాయానికి వ్యవసాయశాఖ అధికారులు వచ్చారు. ఇది గందరగోళానికి తావివ్వకుండా వాస్తవ పంట నష్టాన్ని లెక్కించేందుకు ఉపకరిస్తుందని అంటున్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టం సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో పత్తి పంట నష్టపోయి…
పోర్టల్‌లో మొక్కజొన్న పంట నమోదుచేసి ఉంటే సమస్యలు వస్తాయని, ఏఈవోలే తమకు తెలియకుండా తమ ఇష్టానుసారంగా పంటల నమోదుచేశారని రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందనే చర్చ జరిగింది. ఈ సమస్య అధిగమించడానికి రైతుల నుంచి బయోమెట్రిక్ తీసుకొని, డిక్లరేషన్ తీసుకుంటే… ఏ సమస్యా ఉండదని, ఏఈవో- ఫార్మర్ కాన్సెంట్‌తో క్రాప్ బుకింగ్ పోర్టల్‌లో వివరాలు నమోదుచేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యవసాయశాఖ అధికారులు వ్యక్తంచేసినట్లు సమాచారం. పంటచేనుకు వెళ్లి అక్షాంశాలు, రేఖాంశాలను పరిగణనలోకి తీసుకొని క్రాప్ బుకింగ్ చేయనున్నారు. ఈ అంశంపైనా సమగ్రంగా చర్చించిన తర్వాతే విధివిధానాలు రూపొందించనున్నారు. మరో పక్షం రోజుల్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఆలోపే పంటల బీమాకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించటం, ఇన్సురెన్స్ కంపెనీలు సంప్రదించటం, ప్రీమియంను నిర్ధారించటం, ప్రభుత్వం బడ్జెట్‌ను విడుదలచేయటం చేయాల్సి ఉంటుంది.
సుమారు కోటి 30 లక్షల ఎకరాలకు ఉచిత బీమా
రేవంత్‌రెడ్డి సర్కారు రాష్ట్రంలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. కేంద్రం అమలుచేస్తున్న ఫసల్ యోజనతో వచ్చే ప్రయోజనాలను వినియోగించుకోవటంతోపాటు… రైతులపై ఎలాంటి భారం పడకుండా క్రాప్ ఇన్సురెన్స్ పథకాన్ని అమలుచేయనుంది. అంటే… రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే పంటలకు ప్రీమియం చెల్లిస్తుంది. రైతులు నయాపైసా చెల్లించాల్సిన అవసరంలేదు. ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోతే బీమా కంపెనీల నుంచి నష్ట పరిహారం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ధరణి రికార్డుల ప్రకారం.. రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో మొత్తం సాగవటం లేదు. 2021-22 ఖరీ్‌ఫలో 1.30 కోట్ల ఎకరాలు, 2022-23 లో 1.36 కోట్ల ఎకరాలు, 2023- 24 లో 1.26కోట్ల ఎకరాల్లో… పంటలు సాగయ్యాయి. ఈ లెక్కన వచ్చే ఖరీ్‌ఫలోనూ 1.30-1.35 కోట్ల ఎకరాలకు పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.