ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ… కీలక నిర్ణయాలకు ఛాన్స్…!
ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత….పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. మొన్నటి వరకు ఎన్నికలపై దృష్టి పెట్టిన ఆయన పాలనపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమీక్షిస్తూ వచ్చారు. పోలింగ్ ముగిసిన తర్వాత…. పలు శాఖల అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే చాలా రోజుల తర్వాత కేబినెట్ భేటీ జరుగుతుండటంతో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
కీలక అంశాలపై నిర్ణయాలు…!
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే భవనాల అప్పగింత విషయంతో పాటు పలు అంశాలపై అధికారులకు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.
ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో విభజన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది.
ఇక మరో ప్రభుత్వం ముందు రుణమాఫీ రూపంలో అతిపెద్ద టాస్క్ ఉంది. ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి పదే పదే ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీలోపు మాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో…. రుణమాఫీ కోసం అన్వేషించే మార్గాలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే అధికారులతో జరిగిన సమావేశంలో పలు ప్రతిపాదనలు తెరపైకి వచ్చినట్లు తెలిసింది.
తాజాగా జరిగే కేబినెట్ భేటీలో రుణమాఫీపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. ఇదే కాకుండా అకాల వర్షాలతో చాలా జిల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. మరోవైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అనుకున్నంత వేగంగా నడవటం లేదన్న వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ఖరీఫ్ పంటల సాగు ప్రణాళికపై కూడా చర్చకు రావొచ్చని సమాచారం.
భూముల మార్కెట్ విలువ సవరణ….!
రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచుకునే మార్గాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువ సవరణ విషయం కూడా చర్చకు వచ్చింది.
గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచినట్లు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పటికీ చాలాచోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందని అభిప్రాయపడ్డారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుందన్న ఆయన… ధరల సవరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని దిశానిర్దేశం చేశారు.
ఈ నేపథ్యంలో నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆదాయం పెంపు అంశాలు కూడా చర్చకు రావొచ్చని తెలుస్తోంది.