బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక మలుపు… కాంగ్రెస్ సీనియర్ నేత సహాయకుడి అరెస్ట్…!!

బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక మలుపు… కాంగ్రెస్ సీనియర్ నేత సహాయకుడి అరెస్ట్…!!

రోజు 100కేజీల పై మాటే అక్రమ బంగారం వివిధ రూపాలలో పక్క రాష్ట్రాల నుండి ఆంద్ర కి అక్రమంగా తరలి వస్తుంది అనేది కొందరి నోట…వినిపిస్తున్న మాట…

భారతీయులను, బంగారాన్ని వేరు చేసి చూడలేం.

ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పిచ్చి మరీ ఎక్కువ.

వారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే.. ఎంత సంపాదిస్తున్నా సరే..

వీలైనంత ఎక్కువ బంగారం సమకూర్చుకోవాలని చూస్తారు.

నానాటికీ ధర పెరిగిపోతున్న ఈ విలువైన ఖనిజం ప్రపంచంలో ఎక్కడైనా తక్కువ రేటుకు దొరుకుతుంది అంటే దాన్ని అక్కణ్ణుంచి అడ్డదారుల్లో తీసుకొచ్చేందుకు ఎంత సాహసానికైనా ఒడిగడుతున్నారు.

ప్రతిరోజూ దేశంలోని ఏదో ఒక విమానాశ్రయంలో ,జాతీయ రహదారిపై కస్టమ్ అధికారుల తనిఖీల్లో బంగారం అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూస్తూనే ఉంది.

రోజు వివిధ రాష్ట్రాల నుండి..ఆంద్ర, కి 100కేజీ ల పై మాటే…బంగారం అక్రమంగా వస్తూంది అనేది..చిన్న మాటే….దీనిపై అధికారులు దృష్టి పెడితే….అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు….

కేరళ రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రజలు బంగారం అక్రమ రవాణా విషయంలో మిగతావారి కంటే రెండడుగులు ముందే ఉంటారు.

రాయబార కార్యాలయ సిబ్బందికి ఉండే సదుపాయాలను ఉపయోగించుకుని వారి ద్వారా గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డ వ్యవహారం ఏకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం మెడకే చుట్టుకుందంటే.. బంగారం కోసం అక్కడి ప్రజలు ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధం అని అర్థమవుతోంది.

ఇప్పుడు తాజాగా ఆ రాష్ట్రానికి చెందిన శివకుమార్‌ను ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

దేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తెప్పించి తనకు తెలిసినవారికి అందజేస్తున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎవరో శివకుమార్ బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడితే పెద్దగా విశేషమేమీ లేదు. కానీ ఆ శివకుమార్ ఎవరో కాదు.. దేశ రాజకీయాల్లో తరచు వివాదాస్పద వ్యాఖ్యలు, అభిప్రాయాలతో వార్తల్లో నిలిచే కాంగ్రెస్ నేత శశిథరూర్‌కు సహాయకుడు. ఇదే ఇప్పుడు యావద్దేశం దృష్టిని ఆకట్టుకుంటోంది. శశిథరూర్ వంటి నేతకు బంగారం అక్రమంగా తరలించాల్సిన అవసరమైతే ఉండదు. కానీ ఆయన సహాయకుడు ఈ కేసులో ఇరుక్కోవడంతో ఇప్పుడు థరూర్‌కు బురద అంటుకుంటోంది.

వయా నేపాల్, శ్రీలంక.. ఈ మధ్య కాలంలో ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ వ్యవహారాలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. ఈ మధ్యనే కస్టమ్స్ అధికారుల సోదాల్లో కొలంబో నుంచి వచ్చిన ముగ్గురు శ్రీలంకవాసులను తనిఖీ చేయగా.. వారి వద్ద రూ. 1.23 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురినీ అధికారులు అరెస్టు చేశారు. మరో ఘటనలో నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఢిల్లీ చేరుకున్న గోల్డ్ స్మగ్లర్లలో ఒకరిని డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్టు చేశారు. అధికారులు సోదాలు చేయగా 860.38 గ్రాముల బంగారం బయటపడింది. దీని ధర రూ.55 లక్షలు అని తెలిపారు. శ్రీలంక నుంచి వచ్చిన మరో ఇద్దరు ప్రయాణికులను ఆదివారం కొలంబో నుంచి తనిఖీ చేయగా వారి లగేజీని తనిఖీ చేయగా 67.82 లక్షల రూపాయల విలువ చేసే 1.06 కిలోల బంగారం బయటపడింది.

అధికారుల కళ్లుగప్పి వివిధ రూపాల్లో పసిడి తరలింపు..

సాధారణంగా దుబాయి, సౌదీ అరేబియా వంటి దేశాల్లో బంగారం ధరలు భారత్‌లో ధర కంటే తక్కువ. అందుకే అక్కణ్ణుంచి కొనుగోలు చేసి భారత్‌కు తీసుకొస్తూ ఉంటారు. ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలు, ప్రయాణికులపై అధికారులు గట్టి నిఘా పెడుతుంటారు. చాలామంది అధికారుల కళ్లుగప్పేందుకు బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి, వేర్వేరు వస్తువుల్లో దాచిపెట్టి తీసుకొస్తూ ఉంటారు. కొందరు పేస్టు రూపంలోకి మార్చి తీసుకొస్తున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. మరికొందరు ఏకంగా తమ శరీరం లోపలికి చొప్పించుకుని తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అరబ్ దేశాల నుంచి వచ్చే విమానాలపై నిఘా ఎక్కువగా ఉంటుందని స్మగ్లర్లు దారి మార్చుకుంటున్నారు.

నేరుగా అరబ్ దేశాల నుంచి భారత్‌ రాకుండా.. శ్రీలంక, నేపాల్ వంటి పొరుగుదేశాలకు చేరుకుని, అక్కణ్ణుంచి భారత్‌కు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అంత నిశితంగా నిఘా ఉండదని భావిస్తున్నారు. కానీ స్మగ్లర్ల పన్నాగాన్ని పసిగట్టిన అధికారులు ఈ రెండు దేశాల నుంచి జరుగుతున్న అక్రమ రవాణాను సైతం పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు శశిథరూర్ సహాయకుడు శివకుమార్ వ్యవహారం వెలుగుచూసింది. దీనిపై కస్టమ్స్ విభాగం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.