బెంగళూరు :
మహిళలపై లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.
ప్రజ్వల్ తరఫు న్యాయవాది అరుణ్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. మరోవైపు, మ్యూనిచ్ నుంచి ప్రజ్వల్ మే 30న బెంగళూరుకు వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మే 31న ఆయన బెంగళూరులో అడుగుపెట్టే అవకాశం ఉంది. దీంతో అందరి దృష్టీ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపైనే పడింది. విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్ అధికారులు ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అశ్లీల వీడియోల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్‌ను స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వెంటనే పోలీసులకు లొంగిపోవాలంటూ మాజీ ప్రధాని దేవెగౌడ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక ప్రకారమే తాను విదేశీ పర్యటనకు వెళ్లానని.. మే 31న ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట హాజరవుతానని ఆయన ప్రకటించారు. ఈ కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానంటూ సోమవారం విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.
మరోవైపు, తనపై నమోదైన కిడ్నాప్ కేసులో అరెస్టు చేస్తారనే భయంతో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ ప్రత్యేక కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సిట్ తరఫు న్యాయవాది ఆమెకు ముందస్తు బెయిల్‌పై అభ్యంతరం తెలిపారు. ఇదే కేసులో ఆమె భర్త హెచ్.డి.రేవణ్ణ మధ్యంతర బెయిల్‌ను సైతం రద్దు చేయాలని కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. భవానీకి ముందస్తు బెయిల్‌పై తీర్పును మే 31కి రిజర్వు చేసింది.