భారత నేవీ చేతికి మరో బ్రహ్మాస్త్రం..

భారత నేవీ చేతికి మరో బ్రహ్మాస్త్రం..

త్వరలో చేరనున్న రాఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్..

ఆత్మనిర్భర్‌ భారత్‌ ….దేశ రక్షణ విషయంలో తగ్గేదేలేదన్న మోదీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మేడిన్‌ ఇండియ యుద్ధనౌక విక్రాంత్‌తో జోడిగా ఫ్రాన్స్‌ నుంచి 26 రాఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్‌ కొనుగోలుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు రెండు దేశాల కీలక ఒప్పందం కుదిరింది.

భారత్‌- ఫ్రాన్స్‌ మధ్య రాఫెల్‌ మెరైన్‌ ఫైట్‌ జెట్స్‌ కొనుగోలుకు సంబంధించి కీలకంగా ఒప్పందం గురువారం ఓ కొలిక్కి రానుంది. దాదాపు 50 వేల కోట్ల రూపాయల ఈ డీల్‌కు సంబంధించి ఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అవుతారు.

రాఫెల్‌ మెరైన్‌ వెర్షన్‌ ఫైటర్‌ జెట్స్‌ను తయారు చేసిన డసో ఏవియేషన్‌ సంస్థ ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ఇప్పటికే భారత వాయుసేన దగ్గర 36 రాఫెల్‌ యుద్ద విమానాలు వున్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేయనున్న 26 రాఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్‌ ప్రత్యేకంగా ఇండియన్‌ నేవి కోసమే.

రాఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్‌‌ను సముద్రతల యుద్ధాలకు అత్యంత అనువుగా ఉండేలా తయారు చేశారు. రాఫెల్ ఎం, సింగిల్ సీటర్ ఫైటర్‌ జెట్‌. ఇవి గగన తల రక్షణ, అణుదాడులను సమర్ధవంతంగా గా ఎదుర్కొంటాయి. శత్రు స్థావరాల్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి వస్తాయి.

అంతేకాదు నిఘా వ్యవస్థలోనూ ఈ ఫైటర్‌ జెట్స్‌ కీలకంగా వ్యవహరిస్తాయి. గంటకు 1,389 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ .. గగనతలంలో 50 వేల అడుగుల ఎత్తు వరకు పైకి ఎగురుతాయి.

ఇందులో లాంగ్ రేంజ్ మెటియోర్ మిస్సైళ్లు, ఎంఐసీఏ క్షిపణులు, హ్యామర్, స్కాల్ప్, ఏఎం39, ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థలతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు, నిమిషానికి 2,500 రౌండ్లు పేల్చగల శతఘ్ని పొందుపరిచారు.

గతేడాది జులైలో ప్రధాని నరేంద్ర మోది పారిస్‌లో పర్యటన సందర్భంగా రాఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్‌ కొనుగోలుకు సంబంధించి చర్చలు జరిగాయి. గత డిసెంబర్‌లో బిడ్‌ దాఖలైంది. భారత్‌- ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య ఢిల్లీ వేదికగా గురువారం జరిగే భేటీలో ధర, మిషనరీ నిర్వహణ పై చర్చిస్తారు. తుది ఒప్పందం జరిగేది మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పాడ్డాకే.