100 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన RBI
ఇంగ్లండ్‌లో 1991 నుంచి దాచిన బంగారంలో 100 టన్నులను రిజర్వు బ్యాంకు వెనక్కి తీసుకొచ్చింది. కొన్ని నెలల్లో దాదాపు ఇదే పరిమాణంలో మరోసారి పసిడి సంపదను దేశంలోకి తీసుకొస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2024 మార్చి నాటికి RBI 822.10 టన్నుల బంగారం కలిగి ఉంటే ఇందులో 408.31 టన్నులు దేశీయ వాల్టుల్లో ఉన్నాయి. 1991లో ఆర్థిక సంక్షోభంతో దేశీయంగా బంగారం విలువ పతనం కాకుండా ఇంగ్లండుకు RBI తరలించింది.
బయట ఎందుకు దాచారు? ఎందుకు తెచ్చారు?
ఆర్థిక సంక్షోభం, అంతర్యుద్ధం వంటి సమస్యలతో చాలా దేశాలు బంగారం, ఇతర సంపదను ఇంగ్లండ్ బ్యాంకులో ఉంచుతాయి. దీంతో అవసరమై అక్కడ అమ్మితే అధిక విలువ వస్తుంది. పరిస్థితి చక్కబడితే వెనక్కి తేవచ్చు. 1991లో మన ఆర్థిక మనుగడ ప్రశ్నార్థకం కావడంతో RBI పసిడిని ఇంగ్లండ్‌లో ఉంచింది. ఇప్పుడు తెచ్చి ఆర్థికంగా స్థిరంగా ఉన్నామని ప్రపంచానికి చాటుతోందని నిపుణులు చెబుతున్నారు. అటు బయట వాల్టులకు ఇచ్చే ఫీజులూ మిగులుతాయి.
RBI వద్ద ఎంత పసిడి ఉంది?
రిజర్వు బ్యాంకు వద్ద $57.195 బిలియన్ల బంగారం (2024 మే 17 వరకు) నిల్వలున్నాయి. విదేశీ మారక నిల్వలు (నగదు, డిపాజిట్లు, బంగారం, బాండ్లు తదితరాలు) $648.7 బిలియన్లు. ముంబై, నాగపూర్ ఆఫీసులు, ఇంగ్లండ్ బ్యాంకు వంటి చోట్ల ఇది స్టోర్ చేశారు. రూపాయి పతనం, పలు దేశాల్లో అస్థిరత, పసిడికి డిమాండ్ వంటి కారణాలతో ఇటీవల RBI భారీగా స్వర్ణం సమకూర్చుకుంటోంది. గత ఆర్థిక సం.లో 27.5 టన్నుల పుత్తడి కొనుగోలు చేసింది.
RBI బంగారాన్ని ఎలా తీసుకురానుంది?
ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంకులో దాచిన బంగారాన్ని ప్రత్యేక విమానంలో RBI ఇండియాకు తీసుకురానుంది. కేంద్ర ఆర్థిక శాఖ, కస్టమ్స్, ఏవియేషన్, స్థానిక విభాగాల సమన్వయంతో భారీ భద్రత మధ్య దీన్ని స్టోరేజ్ యూనిట్లకు తరలించనుంది. బయటి నుంచి తెస్తున్న ఈ మొత్తానికి కస్టమ్స్ డ్యూటీ మినహాయించింది. కానీ GSTలో రాష్ట్రాలకి వాటా వెళ్లే IGST (CGST+SGST)ని RBI చెల్లించాలి. 1991లోనూ ఇలాగే విమానంలో పసిడిని UKకు తరలించారు.