మరికొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్… ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ :
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు-2024, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు (మంగళవారం) వెల్లడి కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. ఏడు విడతల పోలింగ్ విజయవంతంగా జిరగిందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఓటు వేసిన ఓటర్లు అందరికీ ఆయన ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చారు. ఇవి చారిత్రాత్మక ఎన్నికలని, రికార్డు స్థాయిలో 64.2 కోట్ల మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారని ఆయన వెల్లడించారు. ఇందులో 31 కోట్ల మంది మహిళలు ఉన్నారని ప్రశంసించారు.
ప్రపంచ రికార్డు
దేశ ఓటర్లు 2024లో చరిత్రను లిఖించారని, ఏకంగా 64.2 కోట్ల మంది ఓటు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారని అన్నారు. ఓటు వేసినవారి సంఖ్య జీ7 దేశాల్లో 1.5 రెట్లు అధికమని, ఈయూలోని(యూరోపియన్ యూనియన్) 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువని రాజీవ్ కుమార్ వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
ఈసారి రీపోలింగ్ చాలా తక్కువ
గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి రీపోలింగ్ తక్కువగా జరిగిందని ఆయన వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగిందని తెలిపారు. ఎన్నికల సిబ్బంది నిబద్ధతో పనిచేయడంతో తక్కువ రీపోల్స్‌కు దోహదపడ్డాయని ఆయన అభినందించారు. 2019లో ఏకంగా 540 చోట్ల రీపోలింగ్ జరిగిందని ప్రస్తావించారు. ప్రస్తుత ఎన్నికల్లో 39 రీపోల్స్ జరగగా అందులో 2 రాష్ట్రాల్లో 25 చోట్ల ఈ రీపోలింగ్ జరిగిందని ఆయన వివరించారు..