BJP పైనే కాదు… అనేక సంస్థలతో పోరాటం చేశాం… రాహుల్ గాంధీ
తాము ఈడీ, సీబీఐ వంటి సంస్థలపై కూడా పోరాటం చేశామన్న రాహుల్ గాంధీ.
మోదీ, అమిత్ షా దర్యాఫ్తు సంస్థలను తమ ఆధీనంలో ఉంచుకున్నారని ఆరోపణ.
మోదీతో పాటు అదానీ కూడా ఓడిపోయారన్న రాహుల్ గాంధీ.
ఈ లోక్ సభ ఎన్నికల్లో కేవలం బీజేపీ పైనే కాదని అనేక సంస్థలతో పోరాటం చేశామని ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఈడీ, సీబీఐ వంటి సంస్థలకు కూడా వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాటం చేసిందన్నారు. ఎందుకంటే ఈ సంస్థలను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ ఆధీనంలో ఉంచుకున్నారని ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో మోదీతో పాటు అదానీ కూడా ఓడిపోయారన్నారు. దేశానికి మా కూటమి కొత్త విజన్‌ను ఇచ్చిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం తాము యుద్ధం చేశామన్నారు. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులను కూడా జైల్లో పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మా పార్టీ అకౌంట్లను కూడా సీజ్ చేశారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారన్నారు. ఈ దేశాన్ని నడిపించడానికి మోదీ, అమిత్ షాలు అవసరం లేదని ఈ ఎన్నికల ద్వారా ప్రజలు చెప్పారని పేర్కొన్నారు.
ఉత్తర ప్రదేశ్ ప్రజలు ఇండియా కూటమికి భారీ సీట్లు ఇవ్వడం ద్వారా రాజ్యాంగాన్ని కాపాడారని వ్యాఖ్యానించారు. అమేథీ నుంచి తమ పార్టీ అభ్యర్థి కిశోర్ లాల్ శర్మ గెలవడం హర్షం వ్యక్తం చేశారు. రేపు ఇండియా కూటమి నేతలం సమావేశమై తదుపరి ఏం చేయాలో చర్చిస్తామన్నారు.