ఘోరం గా ఓడిపోయిన YCP పార్టీ కి ఆశలు పెట్టుకున్న ఎస్సీ, ముస్లిం సామాజిక ఓట్లకు గండి కొట్టింది ఎవరు…?

ఘోరం గా ఓడిపోయిన YCP పార్టీ కి ఆశలు పెట్టుకున్న ఎస్సీ, ముస్లిం సామాజిక ఓట్లకు గండి కొట్టింది ఎవరు…?

అప్పుడు అన్న వదిలిన బాణం. ఇప్పుడు అన్నకే గుచ్చుకున్న బాణం.

కనిపించిన శత్రువు, కనిపించకుండా చేసిన గాయం…

వైసీపీని సలుపుతోంది. జగన్‌ ఓటమిలో చెల్లి షర్మిల పాత్ర ఎంత?

కాంగ్రెస్‌ని గెలిపించలేకపోయినా, వైసీపీని ఓడించడంలో షర్మిల కీలక పాత్ర పోషించారా?

ఆమె ఒకప్పుడు అన్న వదిలిన బాణం. 2014లో జగన్‌ కోసం, వైసీపీ కోసం….వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు షర్మిల. ఆ తర్వాత 2019లో కూడా అన్న కోసం మరోసారి కొంగు బిగించి ఎన్నికల రణరంగంలోకి దూకారు. ఆ తర్వాత జగన్‌తో షర్మిలకు గ్యాప్‌ వచ్చింది. ఇద్దరి దారులు వేరయ్యాయి. రాజకీయ లక్ష్యాలు, గమ్యాల్లో కూడా తేడా వచ్చింది.

ఆ తర్వాత తెలంగాణలో వైఎస్సార్‌టీపీ అనే పార్టీ పెట్టిన షర్మిల…మరోసారి పాదయాత్ర చేశారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే కొద్దిగా ముందుగానే అక్కడ కొట్టు కట్టేశారు షర్మిల. కాంగ్రెస్‌ కండువా కప్పేసుకున్నారు. ఆ తర్వాత ఏపీ పీసీసీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన షర్మిల…ఏకంగా అన్న జగన్‌ పైనే విమర్శల బాణాలు సంధించడం మొదలుపెట్టారు. జగన్‌కు కంట్లో నలుసుగా మారారు. ఇంటి వ్యక్తి శత్రువుగా మారితే…ఆ బాధలు ఇంతింత కాదయా అనే లెవెల్లో జగన్‌ను ఇబ్బందులు పెట్టారు. అన్న వదిలిన బాణం…చివరకు అన్నకే గుచ్చుకుంది.

ఏపీలో కాంగ్రెస్‌కు 2 శాతం కంటే కాస్త తక్కువగా ఓట్లు వచ్చినా, చాలా చోట్ల వైసీపీని ఇబ్బంది పెట్టగలిగారు షర్మిల. మరీ ముఖ్యంగా ఎస్సీలు, ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండే చోట్ల షర్మిల ఫ్యాక్టర్‌ పని చేసిందని చెబుతున్నారు. గుంటూరు ఈస్ట్‌ లాంటి చోట్ల కాంగ్రెస్‌కు మైనారిటీల ఓట్లు బాగానే పడ్డాయనే అంచనా ఉంది. ఇక రాయలసీమలో మరీ ముఖ్యంగా కడపలో షర్మిల వల్ల వైసీపీ బాగా నష్టపోయిందనేది విశ్లేషకుల అంచనా.

కాంగ్రెస్‌ని గెలిపించలేకపోయినా, వైసీపీ ఓటమికి షర్మిల కూడా ఓ కారణం అయ్యారని నిపుణులు చెబుతున్నారు.