పురుగులు పట్టి ఉబ్బిన మృతదేహం.. పీక్కుతిన్న శునకాలు
మంచిర్యాల :
కనీపెంచి పెద్దచేసిన తండ్రి వృద్ధాప్యంలో కదల్లేనిస్థితికి చేరుకోగానే వదిలేశాడా కొడుకు! ఆ వృద్ధుడికి భార్య బతికున్నా బాగోగులు చూసేదేమో! తండ్రి అవసానదశలో ఉన్నాడని గానీ, తాను వదిలేసి వెళితే ఆయన పరిస్థితి ఏమిటి అని గానీ ఆ కుమారుడు ఆలోచించలేదు. తండ్రిని వదిలేసి.. తన భార్యతో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయి మరో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. పాపం.. ఆ పెద్దాయన, కుమారుడు వెళ్లిన మూడు వారాల్లోపే ప్రాణాలొదిలాడు. చనిపోయి ఎన్ని రోజులైందో ఏమో.. ఆ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. దుర్వాసన వస్తుండటంతో స్థానికులు వెళ్లగా కుక్కల మధ్య ఛిద్రమైన మృతదేహాన్ని చూసి హతాశులయ్యారు. మానవతావాదులను కన్నీరు పెట్టించే ఈ ఘోరం మంచిర్యాల జిల్లా దొరగారిపల్లె గ్రామంలో జరిగింది.
మృతుడు అదే గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు బోరె గంగయ్య. స్థానికుల వివరాల ప్రకారం.. నలుగురు కూతుళ్లు, కుమారుడు మల్లేశ్ ఉన్నారు. అందరికీ తానే పెళ్లిళ్లు చేశాడు. నలుగురిలో ఇద్దరు కూతుళ్లను ఊర్లోనే ఇచ్చాడు. గంగయ్య భార్య 2014లో చనిపోయింది. అప్పటికి నుంచి గంగయ్య, కుమారుడు మల్లేశ్, కోడలితో కలిసి నివసిస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం కొడుకు, కోడలు, ఇద్దరు మనవళ్లు ఇంట్లోంచి వెళ్లిపోయి తమదారి తాము చూసుకోవడంతో గంగయ్య ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ నెల 1న పెరుగు ప్యాకెట్ కోసం దగ్గర్లోని కిరాణ షాపుగా వెళుతుండగా గంగయ్యను చివరిసారిగా చూసినట్లు స్థానికులు చెప్పారు.
ఆ తర్వాత.. అంటే ఐదు రోజుల నుంచి గంగయ్య బయటకు రాలేదు. గంగయ్య ఇంటి ప్రాంగణం నుంచి దుర్వాసన వస్తుండటంతో స్ధానికులు వెళ్లిచూడగా ఆరుబయట పురుగులు పట్టేసి ఉబ్బిపోయిన స్థితిలో మృతదేహం.. దాన్ని కుక్కలు పీక్కు తింటుండం కనిపించింది. ఈ సంగతి స్థానికులు చెబితేనే ఊర్లో ఉంటున్న కొడుకు, కోడలికి.. ఇద్దరు కూతుళ్లకు తెలిసింది. మృతదేహాన్ని కదిలించే స్థితి లేకపోవడంతో మునిసిపల్ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.