ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం (3.0) తొలి క్యాబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సాయం అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి మంత్రివర్గం సమావేశం 7 లోక్‌కల్యాణ్ మార్గ్ లోని ప్రధానమంత్రి నివాసంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగింది.
మోదీ మంత్రివర్గ సహచరులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్ ఖట్టార్, కిరణ్ రిజిజు, చిరాగ్ పాశ్వాన్, గిరిరాజ్ సింగ్, మన్షుఖ్ మాండవీయ, హర్దీప్ సింగ్ పురి తదితరులు పాల్గొన్నారు.
కాగా, గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో అర్హులైన పేదల గృహావసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 3 కోట్ల గృహనిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత పదేళ్లలో అర్హులైన పేదలకు 4.21 కోట్ల గృహనిర్మాణాలు పూర్తయ్యాయి. పీఎంఏవై కింద నిర్మాణం జరిగే గృహాలకు టాయిలెట్లు, ఎల్పీజీ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, టాప్ కనెక్షన్ సహా ఇతర మౌలిక వసతులు కల్పిస్తారు.