అదానీ చేతికి కోల్‌కతా పోర్ట్
ఓడరేవులపై పెరుగుతున్న గ్రూపు ఆధిపత్యం దేశ తీర ప్రాంతం దాదాపుగా హస్తగతం
న్యూఢిల్లీ :
అదానీ గ్రూప్ గుప్పిట్లోకి దేశంలోని మరో పోర్టు వచ్చింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) లిమిటెడ్.. కోల్‌కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు కంటైనర్ ఫెసిలిటీ కార్యకలాపాలు, నిర్వహణ కోసం ఐదేండ్ల కాంట్రాక్టును కుదుర్చుకున్నది. కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఈ డీల్‌ను పొందినట్టు ఏపీసెజ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఇప్పటికే దేశంలోని 13 పోర్టులు, టెర్మినల్స్ అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నవే కావడం గమనార్హం. వీటిలో 45 బెర్తులున్నాయి. ముంద్రాలోగల దేశీయ తొలి పోర్ట్ ఆధారిత సెజ్, తిరువనంతపురంలోగల తొలి డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కూడా అదానీ సొంతమే.
ఏడు నెలల్లోగా..
లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (ఎల్వోఏ) తేదీ నుంచి ఏడు నెలల్లోగా కోల్‌కతా కంటైనర్ ఫెసిలిటీలో కార్గో హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ను అదానీ పోర్ట్స్ సంస్థ అందుబాటులోకి తేవాల్సి ఉన్నది. ఇక తమ నిర్వహణలో నేతాజీ సుభాష్ డాక్ వద్ద టెర్మినల్‌కు, కంటైనర్ పోర్ట్స్‌కు మధ్య కనెక్టివిటీ మెరుగవుతుందన్న ధీమాను ఏపీసెజ్ వ్యక్తం చేస్తున్నది. ముఖ్యంగా ఈ ఏడాది విజింజమ్, కొలంబోల్లో ట్రాన్స్షిప్మెంట్ హబ్‌ల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్టు చెప్తున్నది. ‘దేశవ్యాప్తంగా ఆయా పోర్టులు, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో మాకున్న చిత్తశుద్ధి, అంకితభావం వల్లే నేతాజీ సుభాష్ డాక్ కాంట్రాక్టును కూడా దక్కించుకోగలిగాం’ అని ఏపీసెజ్ సీఈవో అశ్వినీ గుప్తా అన్నారు. దేశ, విదేశాల్లోని వివిధ కంటైనర్ టెర్మినల్స్ నిర్వహణలో తమ సంస్థకున్న రెండు దశాబ్దాలకుపైగా అనుభవం పశ్చిమ బెంగాల్ ప్రజలకు, కస్టమర్లకు ప్రయోజనకరంగా మారుతున్నదని కూడా చెప్పారు.
తూర్పు తీరంలో..
భారత తూర్పు తీరంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ డాక్.. అతిపెద్ద కంటైనర్ టెర్మినల్‌గా ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇక్కడ దాదాపు 0.63 మిలియన్ టీఈయూ (20 అడుగులకు సమానమైన యూనిట్) హ్యాండ్లింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్‌తోపాటు బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అస్సాం, ఇతర ఈశాన్య రాష్ర్టాలతోపాటు నేపాల్, భూటాన్‌లకు సేవలు అందాయి. ఈ డాక్‌కు సింగపూర్, పోర్ట్ కెలాంగ్, కొలంబో పోర్ట్ హబ్‌ల నుంచి రెగ్యులర్ లైన్ సర్వీస్ కాల్స్ కూడా ఉన్నాయి.
మోదీ హయాంలోనే..
మోదీ హయాంలోనే అదానీ గ్రూప్ అన్ని రంగాల్లో వేగంగా విస్తరించుకుంటూ పోయింది. ముఖ్యంగా దేశంలోని దాదాపు అన్ని ఓడరేవులు, కీలక విమానాశ్రయాలు ఇప్పుడు గౌతమ్ అదానీ కనుసన్నల్లోనే ఉన్నాయంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. వడ్డించేవాడు మనవాడైనప్పుడు బంతిలో ఏ మూలన కూర్చున్నా విందు భోజనమే. దీనికి తగ్గట్టుగానే గత పదేండ్లుగా కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలో ఉన్న నేపథ్యంలో బిడ్డింగ్‌లో పాల్గొంటే చాలు ఆ కాంట్రాక్టు అదానీదే అన్నట్టు తయారవుతున్నది పరిస్థితి. గుజరాత్ (4), ఆంధ్రప్రదేశ్ (2), తమిళనాడు (2), గోవా (1), మహారాష్ట్ర (1), కేరళ (1), పుదుచ్చెరి (1), ఒడిషా (1)ల్లో అదానీకి పోర్టులున్నాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సైతం ఈ లిస్టులో చేరింది. శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌లోనూ ఉన్నాయి.