కువైట్ వెళ్లేందుకు కేరళ మంత్రికి అనుమతి నిరాకరణ సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం…!!!
మోడీకి కేరళ ముఖ్యమంత్రి విజయన్ లేఖ
తిరువనంతపురం :
మంగాఫిల్ అగ్ని ప్రమాదం నేపథ్యంలో కువైట్ వెళ్లేందుకు ఆరోగ్యమంత్రి వీణా జార్జికి రాజకీయ అనుమతి నిరాకరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధానికి లేఖ రాశారు. జూన్12న కువైట్‌లోని మంగాఫ్‌లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో సగం మంది కేరళీయులేనని, అందుకే రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణాజార్జినికి అక్కడికి పంపాలని కేరళ మంత్రివర్గం నిర్ణయించిందని ముఖ్యమంత్రి ఆ లేఖలో గుర్తు చేశారు.
అక్కడికి వెళ్లిన కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఇతర అధికారులు, భారత రాయబార కార్యాలయానికి సంబంధించిన కా్యకలాపాలను సమన్వయం చేయడానికి కేరళ ఆరోగ్యమంత్రి అక్కడ ఉంటే ఎంతగానో ఉపయోగపడేవారన్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు మనో స్థైర్యాన్ని ఇచ్చేందుకు ఇది ఎంతగానో తోడ్పడేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధ్యతలు నిర్వర్తించడానికి మంత్రిని కువైట్ వెళ్లకుండా అడ్డుకోవడం అత్యంత శోచనీయమని అన్నారు.
2023 ఫిబ్రవరి28 నాటి కేబినెట్ సెక్రటేరియట్ ఆఫీస్ మెమోరాండం ప్రకారం రాజకీయ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా అడ్డుకోవడం, ,కేరళ మంత్రివర్గ నిర్నాయాన్ని సైతం కేంద్రం బేఖాతరు చేయడం సమాఖ్య స్పూర్తిని మంటగలిపేదిగా ఉందన్నారు. విపత్తులు సమయంలో బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యంగా కృషి చేయాలి. ఇలాంటి సందర్భంలో రాజకీయ అనుమతి ఇవ్వడానికి ఎలాంటి రాజకీయ, రాజకీయేతర అడ్డంకులు ఉండరాదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆరోగ్యకరమైన సహకార సమాఖ్య వ్యవస్థకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర గౌరవం, విశ్వాసం అవసరమని ఆయన ఆ లేఖలో తెలిపారు. ఇటువంటి సందర్భాల్లో రాష్ట్రాల విజ్ఞప్తిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ బాధ్యతాయుతంగా స్పందించేలా చూడాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. ఈ నెల 15న విజయన్ రాసిన లేఖ 19న బహిరంగ పరిచారు. భవిష్యత్తులోనైనా ఇలాంటి అభ్యర్థనలు వచ్చినప్పుడు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందిగా విదేశాంగ శాఖకు సూచించాలని కోరారు. కువైట్ అగ్ని ప్రమాదంలో 49మంది మరణించారు. వీరిలో 23మంది కేరళీయులే వున్నారు.