47 లక్షల మంది రైతులు రూ.31 వేల కోట్లు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ

47 లక్షల మంది రైతులు రూ.31 వేల కోట్లు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ

త్వరలో విధివిధానాలతో జీవో.

2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9 వరకు కటాఫ్‌డేట్‌.

రైతుభరోసాపై భట్టి నేతృత్వలో మంత్రివర్గ ఉపసంఘం.

జులై 15లోగా ప్రభుత్వానికి నివేదిక.

ప్రభుత్వ నిర్ణయాలు వెల్లడించే బాధ్యతలు మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబుకు : రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన సీఎం రేవంత్‌ రెడ్డి.

హైదరాబాద్‌ :

తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో ప్రకటించిన విధంగానే ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ భేటీలో రుణమాఫీ, రైతుభరోసాపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానంతరం సహచర మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రివర్గ నిర్ణయాలను సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

రుణమాఫీతో రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్ల లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాటకు కట్టుబడి తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంతో తాము చెప్పిన రైతు రాజ్యం, సంక్షేమ రాజ్యంపై ప్రజలకు భరోసా వస్తుందన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీని నాలుగు విడతలుగా చేయడంతో రైతు రుణమాఫీ బ్యాంకుల వడ్డీల కిందికి వెళ్లిందని గుర్తు చేశారు. గత సర్కార్‌ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతూ, రైతులను ఆత్మహత్యలవైపు నడిపించిందని విమర్శించారు. అలా కాకుండా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే మాట నిలబెట్టుకుంటోందని తెలిపారు.

రైతుభరోసాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్‌ ఎస్టేట్‌ భూములకు, ధనికులకు ఆ పథకం ఇస్తున్నారని చర్చ జరుగుతున్నదని చెప్పారు. అందుకే రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియమించామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సభ్యులుగా క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నియమించమన్నారు. రైతులందరి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించి జులై 15లోగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని తెలిపారు. ఆ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో అర్హులైన రైతులకు పారదర్శకంగా రైతుభరోసాను అమలు చేస్తామని స్పష్టం చేశారు. మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వ పరిపాలనపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యత మంత్రులు శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించినట్టు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. వారిద్దరిచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారమని స్పష్టం చేశారు. ఏవైనా అపోహలుంటే అవసరమైన సమాచారం వారి నుంచి తీసుకోవాలని సూచించారు. రుణమాఫీపై త్వరలోనే విధివిధానాలతో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడతాయని చెప్పారు. నియమ నిబంధనలన్నింటినీ ఆ జీవోలో పొందుపరుస్తామని వెల్లడించారు.

సేద్యం దండగ కాదు..పండుగే..

వ్యవసాయమంటే దండగ కాదు పండుగ అనేలా చేయాలనేదే కాంగ్రెస్‌ విధానమని సీఎం స్పష్టం చేశారు. తమ నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే మాటలను శిలాశాసనంగా అమలు చేస్తామని తెలిపారు. 2004లో కరీంనగర్‌లో జరిగిన సభలో తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ మాటిచ్చి, పార్టీ విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ నిలబెట్టుకున్నదని గుర్తుచేశారు. 2022 మే 6న వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో రాహుల్‌ గాంధీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం 2014లో రూ.16 వేల కోట్లు, 2018లో రూ.12 వేల కోట్లు…మొత్తంగా పదేండ్లలో రెండు దఫాలుగా రూ.28 వేల కోట్లు రుణమాఫీ చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వం మాత్రం ఏకకాలంలో రూ.31 వేల కోట్లను మాఫీ చేయబోతున్నదని వివరించారు. గత సర్కార్‌ చివరిసారిగా రైతు రుణమాఫీకి కటాఫ్‌ తేదీగా 2018 డిసెంబర్‌ 11ను తీసుకున్నారనీ, అందుకే తాము 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9 వరకు ఐదేండ్లలో తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. విలేకర్ల సమావేశంలో సమాచార, పౌరసంబంధాల శాఖ మత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రివర్గ సహచరులందరు పాల్గొన్నారు.