షాద్ నగర్ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫాం పై గూడ్స్…!!

షాద్ నగర్ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫాం పై గూడ్స్

గత వారం రోజులుగా ఇదే దుస్థితి

పత్తాకు లేని రైల్వే స్టేషన్ మాస్టర్

అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైల్వే ప్రయాణికులు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫాం పై గూడ్స్ రైలును గత వారం రోజులుగా నిలుపుతుండడంతో స్థానిక ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రయాణికులకు సదరు స్టేషన్ మాస్టర్ అందుబాటులో లేరు. సిబ్బందిని ఏమిటని అడిగితే స్టేషన్ మాస్టర్ తుంగభద్ర కు వస్తారు అప్పటివరకు వెయిట్ చేయండి అని తాపీగా జవాబులు చెబుతున్నారు.

రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫాంలో గూడ్స్ రైలును ఉదయం వేళలో నిలుపుతుండడంతో స్థానిక ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. సీనియర్ సిటిజన్స్ మహిళలు పిల్లలు మరి ఎంతోమంది ప్రయాణికులు మొదటి ప్లాట్ ఫాం విడిచి అవతలి ప్లాట్ ఫాంలకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. సోమవారం ఉదయం అనేకమంది హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు స్టేషన్ లోకి రాగా అక్కడ ఈ పరిస్థితి చూసి రైల్వే అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మొదటి ప్లాట్ ఫాం అందుబాటులో ఉంటే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని సమయానుకూలంగా ప్రయాణికులు స్పందించవచ్చని కానీ అలా కాకుండా గూడ్స్ రైలును ఏలాంటి ఉపయోగం లేకుండా మొదటి ప్లాట్ ఫామ్ లో పెడితే ఎలా? అని ప్రయాణికులు నిలదీస్తున్నారు. జుట్టు నరసింహా అనే రైలు ప్రయాణికుడు రెగ్యులర్ గా హైదరాబాద్ ప్రయాణిస్తుంటాడు. ఈ విషయమై సదరు అధికారులను ప్రశ్నిస్తే అక్కడ స్టేషన్ మాస్టర్ లేడని జవాబు చెబుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా రైల్వే బోర్డు సలహా మండలి సభ్యులు దిడ్డి గోపాల్ అక్కడే ఉండగా వారిని ప్రశ్నించగా “గాడిదలు కాస్తున్నాము” అంటూ నిర్లక్ష్యంగా జవాబు ఇచ్చారని ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా మరో రైల్వే బోర్డు సలహా మెంబర్ చంద్రశేఖర్ గౌడ్ కు ప్రయాణికుడు ఫోన్ చేయగా సమస్య చెప్పే వరకు విని ఫోన్ పెట్టేసారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత గల వ్యక్తులు కూడా ఇలా ప్రవర్తిస్తే ప్రయాణికులకు ఏలాంటి వెసులుబాటు కల్పిస్తున్నారో వీరి తీరుని బట్టి అర్థం అవుతుందని నరసింహ అనే రైలు ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రయానికుల బాగోగులు చూసుకుని అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత గల స్టేషన్ మాస్టారు ఇతర గౌరవ సభ్యులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ పలువురు ప్రయాణికులు వీళ్ల తీరుపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి గూడ్స్ రైలును మొదటి ప్లాట్ ఫాంపై పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు..