వీళ్లు మామూలోళ్లు కాదు..బాబోయ్… గజ దొంగలకు లీడర్స్ లాగా ఉన్నారు గురూ

వీళ్లు మామూలోళ్లు కాదు..బాబోయ్… గజ దొంగలకు లీడర్స్ లాగా ఉన్నారు గురూ… ఏకంగా బ్యాంకు నే బురిడీ కొట్టించారూ… ఆ ముఠా ఎలా బురిడీ కొట్టించిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!!

సూర్యాపేట జిల్లా :

నేరేడుచర్ల మండలం వైకుంఠాపురంకు చెందిన కేశవరపు రాజేష్ వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్. మిర్యాలగూడలో రాజేష్ గోల్డ్ వర్క్స్ పేరుతో గోల్డ్ షాప్ ను నిర్వహించాడు.

నష్టాలు రావడంతో గోల్డ్ షాప్ ను మూసివేసి అప్పులను తీర్చేందుకు పథకం వేశాడు.

ఏపీలోని తెనాలి, నెల్లూరు నుండి నకిలీ బంగారు కట్టు (గొలుసు) తయారు చేయించి, ఆ నకిలీ బంగారంపై హాల్ మార్క్ KDM 916 ముద్రించేవాడు.

గరిడేపల్లి మండలం రాయిని గూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పని చేసే బ్యాంక్ అప్రయిజర్ జిల్లేపల్లి నరేందర్ తో రాజేష్ కు పాత పరిచయం ఉంది.

నకిలీ బంగారంపై హాల్ మార్క్ ముద్రణ…

హాల్ మార్క్ ముద్రించిన నకిలీ బంగారాన్ని బ్యాంకు లోన్ కోసం తీసుకొచ్చే సమయంలో అసలైన బంగారంగా ధ్రువీకరించాలని అప్రైజర్ నరేంద్రతో‌ రాజేష్ ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు కొంత నగదును ఇస్తానని నమ్మబలికాడు. దీంతో తనతోపాటు భార్య వర్శిత, వైకుంఠపురంలోని బంధువులు, ఫ్రెండ్స్ కొమెరపూడి వెంకటచారి, కణితి సాయిరాం, అర్రగొర్ల పరశురాములు, దోనేటి ముఖేష్, మోతుకూరి సూర్యల పేరిట నకిలీ బంగారాన్ని తనఖా పెట్టాడు. నకిలీ బంగారాన్ని బ్యాంక్ అప్రయిజర్ నరేందర్ అసలైన బంగారంగా ధ్రువీకరించడంతో బ్యాంక్ అధికారులు లోన్ మంజూరు చేశారు. దీంతో 53.89 లక్షల రూపాయలను రాజేష్ కాజేశాడు.

బ్యాంకు అంతర్గత తనిఖీలతో కదిలిన డొంక..

గరిడేపల్లి మండలం రాయని గూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నకిలీ బంగారంని తాకట్టు పెట్టి రాజేష్ పొందిన లోన్ వ్యవహారంపై గ్రామస్తులకు అనుమానంతో బ్యాంక్ అంతర్గత తనిఖీల్లో అది నకిలీ బంగారంగా తేలింది. దీంతో బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ గరిడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి అక్రమంగా లోన్ పొందిన 8 మందిని అరెస్టు చేసినట్లు హుజూర్‌నగర్ సిఐ చరమందరాజు తెలిపారు.