పార్టీ వీడిన BRS MLAలను ఉద్దేశించి KCR షాకింగ్ కామెంట్స్
మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన బీఆర్ఎస్కు వచ్చిన నష్టమేమీలేదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్‌ను గద్దె దించే రోజులు దగ్గరపడ్డాయని, కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలే గుర్తిస్తారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ శ్రేణులు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు., కాగా ఇటీవల మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరింతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడబోతున్నారనే ఊహాగానాలు గుప్పమన్నాయి. దీంతో గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫిరాయింపులకు కళ్లెం వేసేందుకుగాను ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు పలువురు ఎమ్మెల్యేలను సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు పిలిపించుకొని మాట్లాడారు.
తన దగ్గర ప్లాన్ ఉందని, కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయని పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు. ఈ కీలక పరిణామాలు జరిగేందుకు నెల కూడా పట్టదని, ధైర్యంగా ఉండాలని అన్నారు. ఏ ఇబ్బంది కలిగినా.. నేరుగా తన వద్దకు రావాలంటూ సూచించారు. ఎటువంటి నష్టం జరగనివ్వనంటూ ఎమ్మెల్యేలకు ఆయన హామీ ఇచ్చారు.
కాగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకు ఐదుగురు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ ఈ జాబితాలో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా పార్టీని వీడుతారని ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే..