కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్…
హైదరాబాద్ :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన పనులనే కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ దుర్మార్గాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు వస్తున్నాయని.. బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి ఆరోపించారు.
తాము కూడా అలాగే వ్యవహరిస్తే.. తెలంగాణ అభివృద్ధి జరగదని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీలకు తాము నిధులు ఇవ్వకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు బండి సంజయ్. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అవమానిస్తారా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ మీద తిరగబడినట్లే కాంగ్రెస్ ప్రభుత్వంపైనా తిరుగుబాటు చేస్తారని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అందరికీ సమానంగా నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో బీఆర్‌స్ దారిలోనే కాంగ్రెస్ నడుస్తోందని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తుపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. పవన్ కల్యాణ్ ప్రతిపాదనపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. జనసేనతో బీజేపీ పొత్తుపై కిషన్ రెడ్డి, జేపీ నడ్డా ఆలోచిస్తారని చెప్పారు. బీజేపీతో జనసేన పొత్తు తన పరిధిలో లేదని.. దానిపై తానేమీ మాట్లాడనని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ కూటమిగా ఉన్న విషయం తెలిసిందే. అదే పొత్తు తెలంగాణలోనూ కొనసాగించాలని జనసేనాని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అయితే, దీనిపై బీజేపీలో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే..