రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన అవినీతి అధికారి..
ఓ రైతు నుండి 8000 రూపాయలు లంచం తీసుకొని వనపర్తి జిల్లా గోపాల్ పేట తహశీల్దార్ శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి మహబూబ్ నగర్ ఏసీబీ డి.ఎస్.పీ కృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పలకపాటు గ్రామం జింకల మిట్ట తండాకు చెందిన ముడావత్ పాండు నాయక్ అనేవ్యక్తి తనకున్న వ్యవసాయ పొలంలో కోళ్ల ఫారం షెడ్ నిర్మాణం చేశాడు.
ఆ స్థలాన్ని నాన్ అగ్రికల్చర్ గా మార్చేందుకు ఈనెల 21వ తేదీన చాలన్ చెల్లించాడు. ఈనెల 22వ తేదీన పాండు నాయక్, అతని భార్య సౌందర్య కలిసి తహశీల్దారు వద్దకు వెళ్లి నిర్మించిన పౌల్ట్రీ ఫామ్ కు నాలా పర్మిషన్ ఇవ్వాలని అడగగా.. తహశీల్దార్ 15వేల రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు. పాండు నాయక్ తాము అంతా ఇచ్చుకోలేమని తగ్గించాలని కోరగా పదివేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈనెల 23వ తేదీన మరోసారి వచ్చి సార్ అన్ని డబ్బులు కూడా ఇవ్వలేము అనగా చివరగా ఎనిమిది వేల రూపాయలు ఇస్తే నాలా పర్మిషన్ ఇస్తామని చెప్పడంతో పాండు నాయక్ ఇంటికి వెళ్లి అవినీతి నిరోధక శాఖ అధికారులకు సంబంధించిన వీడియోలను చూసి.. మహబూబ్ నగర్ డీఎస్పీ కృష్ణ గౌడ్ కు సమాచారం ఇచ్చి అతనిని స్వయంగా కలిశారు.
ఇందులో భాగంగా కృష్ణ గౌడ్ తో పాటు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు సీఐలు, పదిమంది ఇతర సిబ్బందితో కలిసి రైతు పాండు నాయక్ కు ఎనిమిది వేల రూపాయలను ఇచ్చే విధంగా పథకం రూపొందించి అమలు చేశారు. డబ్బులు ఇచ్చి బయటకు వచ్చిన రైతు విషయాన్ని అధికారులకు తెలపడంతో వారు లోపలికి వెళ్లి తహశీల్దార్ ను అదుపులోకి తీసుకొని, 8000 రూపాయలు స్వాధీనపరచుకొని కేసునమోదు చేశారు.