ప్రైవేట్ హాస్పిటల్స్… సంపాదించి పెట్టే క్యాష్పిటల్స్
క్వాలిఫైడ్ అంతే.. అన్ క్వాలిఫైడ్ వైద్యులు అంతే
ప్రైవేటు దోపిడిపై ష్.. అంతా గప్ చుప్ !
కాసులు కురిపిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు
కమీషన్ ఏజెంట్లు, ఆసుపత్రి మేనేజ్ మెంట్ డైరెక్టర్లుగా ప్రాక్ట్టీషనర్లు
ఒకరిద్దరు కలిసి ఆసుపత్రుల ఏర్పాటు
అరువు వైద్యులతో దండిగా దోపిడీ ప్రస్థానం
బిల్లులో ఎక్కువ కమీషన్
చెప్పిన ఆసుపత్రులకు వెళ్లకపోతే అంతేసంగతులు
అడ్డుకట్ట వేయలేకపోతున్న జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారులు
సొంత ప్రైవేట్ ఆస్పత్రులలో సర్కార్ వైద్యులు
జిల్లాలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ డబ్బులు సంపాదించి పెట్టే “క్యాష్పిటల్స్”గా మారాయి.
క్వాలిఫై డాక్టర్లు అదేవిధంగా అన్ క్వాలిఫైడ్ డాక్టర్ల పరిస్థితి ఇద్దరిదీ ధనార్జన పైనే ఉందని నియోజకవర్గంలో విమర్శలు గుప్పుమంటున్నాయి. వైద్యం కోసం ఆసుపత్రి స్థాపించి రోగులకు సేవలు అందించే కాలం నుంచి ప్రస్తుతం అరువు వైద్యున్ని నియమించుకుని, ఆర్ఎంపీలు, పీఎంపీలు,అంబులెన్స్ డ్రైవర్లు, పీఆర్వోల సహాయంతో వ్యాపారంచేసే పరిస్థితులకు ప్రస్తుతం దిగజారాయి. చిన్న జ్వరం వచ్చినా.. ఇష్టారీతిన రక్త, మూత్ర పరీక్షలు చేయిస్తూ లేని రోగం అంటగడతూ వైద్యం చేసే స్థాయికి ఎదిగాయి. కొందరు ప్రైవేట్ వైద్యులు సిండికేట్ గా మారి డయాగ్నొసిటిక్ సెంటర్లు కూడా ఎవరికి వారు పెట్టుకుంటున్నారు.
ఇక ప్రైవేట్ ఆస్పత్రిలో మెడికల్ షాపుల దందా గురించి చెప్పే అవసరమే లేదు. ప్రతి ఒక్కడు ప్రైవేటులో మెడికల్ బాధితుడే. రోగి బాధను, భయాన్ని క్యాష్ చేసుకునే వ్యాపారంలో ప్రణాళికబద్ధంగా సాగుతోంది. కొత్తగా ఏర్పాటైన ఆసుపత్రుల నుంచి అంతో ఇంతో పేరున్న పాతవి కొన్నీ హాస్పిటళ్ల వరకు అధిక డబ్బులు గుంజుడు పైన ఆధారపడి వ్యాపారం సాగిస్తున్నాయి. అంతేకాదు ఫలానా ఆసుపత్రికి రోగిని ప్రమోట్ చేస్తే రోగి చెల్లించే ఫీజుల నుంచి సుమారు 30 శాతం కమీషన్లు ఇస్తున్నాయి. మరికొందరు మరో అడుగు ముందుకేసి ఒకరిద్దరు ఆర్ఎంపీ, పీఎంపీలు కలిసి అరువు వైద్యులతో పేదరోగుల నుంచి పెద్ద దోపిడినే చేస్తున్నారు. తమ వద్ద ఎలాంటి సర్టిఫికెట్లు లేకపోయినప్పటికీ ఈ అన్ క్వాలిఫైడ్ వైద్యులు కొందరు ఏకంగా మేనేజ్మెంట్ డైరెక్టర్లుగా చలామణి అవుతూ పెద్ద ఎత్తున ఆసుపత్రులను స్థాపిస్తున్నారు అందులో అరువు వైద్యులను తెచ్చి పెట్టుకుంటున్నారు. గ్రామాల నుంచి రోగిని తీసుకొస్తే చాలు నీకింత..నాకింత అనేధోరణిలో వైద్యవ్యాపారం జోరుగా సాగుతోంది. మెడికల్ టెర్మానాలజీ తెలియకున్నా..
మెడికల్ టెర్మినాలజీ గురించి తెలియని పలువురు ఆర్ఎంపీ, పీఎంపీలు డాక్టర్ల పేరుతో చెలమణి అవుతున్నారు. ఇంటికి వచ్చి మందులు ఇచ్చే మెడికల్ ప్రాక్టీషనర్ల వెనుక పెద్ద మాఫియానే నడుస్తోంది. కమీషన్లు, గిప్టులు, వాటాలు, స్టార్హోటళ్లలో విందులు, విదేశీ ప్రయాణాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే కొందరు ఆర్ఎంపీ,పీఎంపీలు అనుభవిస్తున్న రాజభోగం అంతా ఇంతా కాదు. అనేక ప్రాంతాలలోని ఆర్ఎంపీ, పీఎంపీలకు 30 నుంచి 50 శాతం వరకు హాస్పిటళ్ల స్థాయిని బట్టి కమీషన్లు ఇచ్చి మరి రోగులను ఆసుపత్రులకు రప్పించుకుంటున్నారు. ఇలాంటి కమీషన్లకు ఆశపడుతున్న ఆర్ఎంపీలు రోగులను భయపెట్టి మరి వారు చెప్పిన ప్రైవే ట్ ఆసుపత్రులకు పంపిస్తున్నారు. అవసరం లేకపోయినా రోగుల్ని ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రులకు పంపించి అడ్డగోలు ఆపరేషన్లు చేయిస్తున్నారు. చిన్నపాటి జబ్బులకు కూడా రకరకాల పరీక్షలు చేయించి తమ వాటా తీసుకుంటున్నారు.
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆసుపత్రులు
జిల్లాలలో ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో మందుల పేరిట అధిక రేట్లకు అంటగడుతూ దోపిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో రోగాల బారిన పడిన వారి ఇంటింటికీ వెళ్లి చికిత్సలు అందించడం, సరైన వైద్యం అందించకుండా రోజుల తరబడి మంచానపడేలా చేస్తూ వారిని వారు నెలకొల్పిన ఆసుపత్రులకు పంపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రోగి ఆసుపత్రికి వెళ్లగానే వైద్యులు స్కానింగ్, ఎక్స్రేలు, ఈసీజీలు, రక్త, మూత్ర పరీక్షలు అంటూ అవసరం లేకున్నా చేయిస్తూ కమీషన్ల రూపంలో దోపిడీ పర్వానికి తెరలేపుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
ప్రైవేటు ఇష్టారాజ్యం..!
చాలా ప్రైవేట్ ఆస్పత్రులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా మల్టీస్పెశాలిటి ఆసుపత్రులుగా అవతారం ఎత్తుతున్నాయి.
కొందరు పేరు మోసిన అధికారుల సొంత ఆసుపత్రులు కూడా ఇక్కడ ఉండడంతో వాటిలో ప్రభుత్వ డాక్టర్లు ఏదేచ్ఛగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పర్యవేక్షణ చేసే అధికారులు వాళ్లకు సంబంధించిన ఆసుపత్రులపై దాడులు చేసిన దాఖలాలు ఎక్కడా లేవని మిగతా ప్రైవేట్ ఆస్పత్రుల నోటి వెంట విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో 2024 మార్చి వరకు 127 ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ చేసుకుని చలామణిలో ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్ మిగతా మూడు నెలల కాలంలో నెలకొల్పిన ఆసుపత్రులకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారు మరికొంతమంది ఉన్నారు. కొంతమంది ఆర్ఎంపి వైద్యులు యదేచగా మూడు నుండి నాలుగు ఆస్పత్రులు ఏర్పాటు చేసుకొని మేనేజ్మెంట్ డైరెక్టర్ గా చలమణి అవుతున్నారంటే వైద్యంలో ఎంత ఆదాయం లభిస్తుందో ?వేరేగా చెప్పనక్కర్లేదు. పత్రికల్లో చిన్న కథనం వస్తే హడావుడి చేస్తున్న వైద్యశాఖ అధికారులు తిలోదకాలు ఇస్తున్న కొన్ని ఆసుపత్రుల గురించి ఎందుకు వాకబు చేయడం లేదు.? ఆ ఆసుపత్రులలో ఎందుకు తనిఖీలు జరగలేదనే విషయం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పేరుపొందిన ఆసుపత్రులు కొంతమంది వైద్య నాయకుల ఆసుపత్రుల్లో ఎలాంటి తనిఖీలు ఉండవు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మల్టీస్పెషాల్టి ఆసుపత్రులో మాత్రం దర్జాగా తనిఖీలు నిర్వహించి తమ రుబాబు ప్రదర్శిస్తుంటారు. దొరికితే దొంగ లేకపోతే దొర అన్న చందంగా వైద్యశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు..
ప్రైవేటు ఆసుపత్రులు నెలకొల్పాలంటే అనేక నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో ఎంబిబిఎస్ పట్టాకు అనుమతి ఉండాలి. తాము నిర్వహిస్తున్నది సొంతభవనమా లేక లీజుకు తీసుకున్నారా వాటి సంబంధించిన పత్రాలను సమర్పించాలి. బయో మెడికల్ వేస్టేజ్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. కానీ ఆసుపత్రిలో బయో మెడికల్ వేస్టేజ్ కు సంబంధించిన మూడు రంగుల డబ్బాలు ఎక్కడ సరిగ్గా కనిపించవు.
వైద్య భవనాలు అగ్నిమాపక సిబ్బంది ఇచ్చిన ధ్రువపత్రం ఉండాలి. ఆసుపత్రిలో అన్ని విభాగాలు మంటలను అదుపు చేసే వ్యవస్థ ఉండాలి.
కచ్చితంగా ఆసుపత్రి నెలకొల్పే వారి ఆధార్ కార్డు ఐటి పత్రాలు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ప్రభుత్వానికి సమర్పించాలి. ఆసుపత్రికి చుట్టూ వెంటిలేషన్ సరిగా ఉండాలి, ఆసుపత్రులు రోగులకు అనుకూలంగా ర్యాంప్ ఉండాలి లేదా లిఫ్ట్ ఏర్పాటు చేయాలి. విధిగా ఆక్సిజన్ సిలిండర్లు ప్రతి గదిలో బయోవేస్టేజ్ బాక్సులు ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఆసుపత్రి నిర్వహిస్తే సంబంధిత వైద్యులు అందులో ఉన్న వారివి సర్టిఫికెట్స్ కూడా ప్రభుత్వానికి అందజేయాలి ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు ప్రభుత్వ శాఖ వద్ద నిక్షిప్తమై ఉండాలి. ఇంకా అనేక అనుమతులు కలిగి ఉండాలి. ఐదు సంవత్సరాలకు ఒకసారి వైద్యుల సర్టిఫికెట్ను వెరిఫికేషన్ చేయించాలి. మరి ఇన్ని నిబంధనలు పాటిస్తున్నారా అంటే ఇందులో ఏ నిబంధన ఎవరు పాటిస్తున్నారు వైద్య అధికారులకే తెలియాలి..