డబ్బున్న మగాళ్లను ఎలా వలలో వేసుకోవాలో నేర్పిస్తూ ఏటా రూ.168 కోట్ల సంపాదన…!!
చైనాలో ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వివాదాస్పదం
డబ్బున్న మగాళ్లను ప్రేమలో ఎలా దింపాలో చెబుతూ ప్రత్యేక ఆన్లైన్ సెషన్లు
రకరకాల ప్యాకేజీల పేరిట కోట్ల కొద్దీ వసూలు
ఆమె సలహాలు తమ జీవాన్ని మార్చేశాయంటున్న మహిళలు
పురుషులను డబ్బు తెచ్చి పెట్టే యంత్రాలుగా చూస్తోందంటూ కొందరి విమర్శలు
డబ్బున్న మగాళ్లను ఎలా ప్రేమలో దించి పెళ్లాడాలో మహిళలకు తర్ఫీదునిస్తూ కోట్లు కొల్లగొడుతోంది ఓ మహిళ. యువతులకు, మహిళ ఇలాంటి వివాదాస్పద ప్రేమ పాఠాలు నేర్పిస్తూ ఈ ఇన్ఫ్లుయెన్సర్ చైనాలో లవ్ గురువుగా పాప్యులారిటీ సాధించింది. ఏటా రూ.168 కోట్లు సంపాదిస్తోంది.
చైనా సోషల్ మీడియాలో కూకూగా చిరపరిచితమైన ఈమె పేరు లీ చువాంకూ. ఆమె దృష్టిలో పెళ్లంటే ఆర్థిక లక్ష్యాలు చేరుకునేందుకు ఓ మార్గం. ఇతర మహిళలు కూడా ఇదే మార్గంలో కొనసాగాలని చెబుతోంది. మహిళలకు వివాహబంధం ఓ కోట లాంటిదని ఆమె చెబుతుంది. డబ్బును బియ్యంతో పోలుస్తుంది. ఇక గర్భధారణ అంటే ఆమె దృష్టిలో ఓ బంతిని కడుపులో మోయడం. మౌలిక స్థాయిలో ఏ బంధమైనా పరస్పర ప్రయోజనాలకు ఉద్దేశించినదే. కాబట్టి, రిలేషన్షిప్లో ఉన్న ప్రతి ఒక్కరు తమకు ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా చూసుకోవాలి.
లైవ్ స్ట్రీమ్‌లో సలహాలు ఇచ్చేందుకు ఆమె ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.13 వేలు వసూలు చేస్తుంది. ఇక ఆన్లైన్ వ్యాలుయెబుల్ రిలేషన్షిప్ పాఠాల ఖరీదు రూ.43 వేలు. ఇక వ్యక్తిగతంగా వచ్చి సలహాలు తీసుకోవాలంటే రూ.1.16 లక్షలు ముట్టచెప్పాల్సిందే. ఇలా ఒక్కో సందర్భానికి ఒక్కో రేటు చొప్పున వసూలు చేస్తూ రెండు చేతులా దండిగా సంపాదిస్తోంది.
స్త్రీ పురుషుల సంబంధాన్ని డబ్బుమయంగా మార్చేసిన ఆమెను ఎప్పుడో సోషల్ మీడియాలో నిషేధించారు. అయితే, వివిధ మార్గాల్లో తన ఫాలోవర్లకు అందుబాటులో ఉంటూ సంపాదన కొనసాగిస్తోంది. ఆమెపై ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. డబ్బున్న మగాళ్లను ఆకర్షించేందుకు మహిళలు తమని తాము లైంగిక వస్తువులుగా మార్చుకునేలా ఆమె ప్రోత్సహిస్తోందని విమర్శిస్తున్నారు. మగాళ్లంటే డబ్బులు సంపాదించే యంత్రాలు కాదని మండిపడుతున్నారు. మగాళ్లను డబ్బు తెచ్చే యంత్రాల్లా చూస్తూ ఆడాళ్ల మధ్య అనారోగ్యకర పోటీని పెంచుతోందని కొందరు విమర్శించారు. ఆమె సూచనల్లో తప్పేమీ లేదనేది కొందరి వాదన. ఏ బంధంలోని వారైనా తమ జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించడంలో తప్పేమిటని కొందరు అభిప్రాయపడ్డారు.
‘‘ఆమె నాపై చాలా ప్రభావం చూపించింది. లక్ష్యాలు ఎలా నిర్దేశించుకోవాలి, మనకున్న వనరులన్నీ ఉపయోగించి శక్తిమంతం ఎలా కావాలో తెలిపింది’’ అని ఓ మహిళ వ్యాఖ్యానించింది. మగాడి అసలు తత్వంపై లోతైన అవగాహన కల్పించిందని చెప్పుకొచ్చింది.