ఓతండ్రి పిల్లల అల్లరి మాన్పించడానికి సరదాగా ఓ అబద్ధం చెప్పాడు

విశాఖపట్నం ఓతండ్రి పిల్లల అల్లరి మాన్పించడానికి సరదాగా ఓ అబద్ధం చెప్పాడు.

కానీ అదే అతని పాలిట మృత్యుశాసనం అవుతుందని అతను ఊహించలేకపోయాడు.

మీరు అల్లరి చేస్తే.. నేను చచ్చిపోతానని.. పిల్లల అల్లరిని మాన్పించడానికి ఆ తండ్రి చేసిన ప్రయత్నం నిండు జీవితాన్ని బలితీసుకుంది.

ఈ విషాదకర సంఘటన విశాఖపట్నంలోని గోపాలపట్నంలో బుధవారం (జులై 17) వెలుగు చూసింది.

గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

బీహార్‌కు చెందిన చందన్‌ కుమార్‌ (33) అనే వ్యక్తి రైల్వేలో సీనియర్‌ అసిస్టెంట్ లోకో పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి చందన్‌ విశాఖపట్నం 89వ వార్డు కొత్తపాలెంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు సంతానం.

బుధవారం రాత్రి ఆయన కుమార్తె (7), కుమారుడు (5)తో సరదాగా ఆడుకుంటున్న సమయంలో.. అతని చొక్కా జేబులోని కరెన్సీ నోట్లను తీసి చించేశారు. దీంతో పిల్లలపై మండిపడిన చందన్‌ కుమార్‌ను భార్య వారించింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

దీంతో విసిగెత్తిపోయిన చందన్ కుమార్ ఇంట్లో తనకు ప్రశాంతత లేకుండా చేస్తే, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

అయితే ఆయన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

దీంతో కోపోధ్రిక్తుడైన చందన్‌ కుమార్ ఇంట్లో గడియ పెట్టుకుని, ఫ్యాన్‌హుక్‌కు చీర కట్టి, దాన్ని మెడకు చుట్టుకుని కుటుంబసభ్యుల్ని భయపెట్టేందుకు యత్నించాడు.

అంతలో పొరపాటున చీర అతని మెడకు బిగుసుకుపోయింది. కుటుంబ సభ్యులు తలుపులు విరగ్గొట్టి అతన్ని చేరేలోపు ఆలస్యమైంది.

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చందన్‌ కుమార్‌ణు కాపాడుకునేందుకు ఆయన భార్య విశ్వప్రయత్నాలు చేసింది.

అయినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.

మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. క్షణకాల తప్పిదం సరిదిద్దుకోలేని పొరబాటుకు కారణమైందని మృతుడి భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది.