నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వసూళ్ల దందా

నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వసూళ్ల దందా…

ఐదు నెలల్లోనే రూ.18 లక్షలు జేబులో వేసుకున్న ఘనులు.. చేతులు మారుతున్న లక్షల రూపాయలు

నల్గొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల నుంచి డబ్బులు వసూళ్లు చేయడం మామూలుగానే కొనసాగుతోంది. దీనికి తోడు కొత్త దందా మొదలైంది. ఏదో ఒక సాకుతో శానిటేషన్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తీసేయడం, కొత్త వాళ్లను పెట్టడాన్ని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యాపారంగా మార్చేసింది.

తీసేసిన ఉద్యోగులను తిరిగి డ్యూటీలోకి తీసుకోవాలంటే ఒక రేటు, కొత్త ఉద్యోగాలకు మరో రేటు ఫిక్స్ చేశారు. శానిటేషన్ విభాగంలో ఏ చిన్న తప్పు జరిగినా.. వాళ్లను ఏకంగా ఉద్యోగాల నుంచి తీసేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇలా తీసేసిన ఉద్యోగులతో బేరసారాలు మాట్లాడుకోవడం, అలాంటి వాళ్లకు పగలు డ్యూటీలు వేస్తే ఆఫీసర్లు గుర్తుపడ్తారని, నైట్ డ్యూటీలకు పంపిస్తున్నారు. ఇంకోవైపు కొత్త ఉద్యోగులను పెడితే రూ.లక్ష, రెండు లక్షలు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత ఐదు నెలల నుంచి అకౌంట్లలో పీఎఫ్, ఈఎస్ఐ జమ కాలేదు. ఒక్కో ఉద్యోగి పేరు మీద నెలకు సుమారు రూ.2 వేలు జమ చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో మొత్తం 180 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, నెలకు రూ.3.60 లక్షలు వాళ్ల అకౌంట్లో జమ కావాలి. కానీ అకౌంట్లలో అన్ని జీరో బ్యాలెన్స్ చూపిస్తున్నాయి. ఐదు నెలలకు కలిపి సుమారు రూ.18 లక్షలు ఏజెన్సీ తన జేబులో వేసుకుంది.