నేటి వివాదం CBI కస్టడీలో మరో ముగ్గురు MBBS విద్యార్థులు

దిల్లీ :

నీట్‌ యూజీ 2024 పేపర్‌ లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న సీబీఐ తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేసింది. వీరిద్దరూ మెడిసిన్‌ విద్యార్థులు కావడం గమనార్హం. వీరిని కుమార్‌ మంగళం బిష్ణోయ్‌, దీపేందర్‌ శర్మలుగా గురించారు. వీరు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ మెడికల్‌ కళాశాలలో చదువుతున్నట్లు  అధికారులు వెల్లడించారు.

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కి చెందిన ట్రంక్‌ పెట్టె నుంచి నీట్‌ పేపర్‌ను తస్కరించాడన్న కేసులో 2017 బ్యాచ్‌ ఎన్‌ఐటీ జంషెడ్‌పుర్‌ సివిల్‌ ఇంజినీర్‌ పంకజ్‌ కుమార్‌ అలియాజ్‌ ఆదిత్యను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇతడికి వీరిద్దరు సహకరించారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 21కి చేరింది.

కాగా.. ఎన్‌టీఏ ఆధ్వర్యంలో మే 5న నీట్‌ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 4,570 కేంద్రాల్లో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. అయితే.. 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం. అంతేకాకుండా ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన పలువురు విద్యార్థులకు ఫస్ట్‌ ర్యాంకు రావడం అనుమానాలకు దారితీసింది. ఈ కేసులో ఇటీవల నలుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులను అరెస్టు చేసిన రెండు రోజుల వ్యవధిలోనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.