IAS కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదు: బాలలత
సివిల్స్ దివ్యాంగుల కోటాపై స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై CSB IAS అకాడమీ చీఫ్ బాలలత మండిపడ్డారు. IAS కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదన్నారు. ‘దివ్యాంగుల గురించి మాట్లాడటానికి మీరెవరు? ఇద్దరం పరీక్ష రాద్దాం. ఎవరికెక్కువ మార్కులు వస్తాయో చూద్దామా? 24గంటల్లో మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే దివ్యాంగులు ఆందో ళనకు దిగుతారు. స్మితకు CS షోకాజ్ నోటీస్ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.
సివిల్స్‌లో దివ్యాంగుల కోటా ఎందుకుండాలి?: స్మితా సబర్వాల్
TG: సివిల్ సర్వీసెస్‌కు దివ్యాంగుల కోటా ఎందుకంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్విటర్లో ప్రశ్నించారు. ‘దివ్యాంగులంటే పూర్తి గౌరవం ఉంది. కానీ విమానయాన సంస్థలు పైలట్లుగా, ఆస్పత్రులు వైద్యులుగా దివ్యాంగుల్ని నియమించుకోగలవా? పౌరసేవల కొలువులు సుదీర్ఘ శారీరక శ్రమతో కూడుకున్నవి. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. వీటిలో రిజర్వేషన్ ఎందుకు?’ అని ప్రశ్నించారు. ఆమె ట్వీట్ దుమారాన్ని రేపుతోంది.
IAS స్మితా సబర్వాల్‌పై విమర్శలు
సివిల్స్ వికలాంగుల కోటాపై IAS స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై ఓ వైద్యుడు స్పందిస్తూ తాను డాక్టర్ కావడానికి దివ్యాంగులైన టీచర్లు పాఠాలు చెప్పారన్నారు. వాళ్లకు అవకాశం ఇవ్వకపోతే గొప్ప గురువులను కోల్పోయేవారిమన్నారు. వైద్యం చదివేందుకు, చెప్పేందుకు, చేసేందుకు అంగవైకల్యం అడ్డు కాదని, అలాగే పరిపాలనకు ఇది మినహాయింపు కాదన్నారు.