జగిత్యాల జిల్లాలో రౌడీ షీటర్స్,హిస్టరీ షీటర్స్ లపై నిరంతర పర్యవేక్షణ.

జగిత్యాల జిల్లా… రౌడీ షీటర్స్,హిస్టరీ షీటర్స్ లపై నిరంతర పర్యవేక్షణ.

ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు.

పాత నేరస్తులు సత్ప్రవర్తనతో జీవితాలను సరిదిద్దుకోవాలి.

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ రకాల నేరాల్లో నిందితులుగా ఉండి రౌడీ షీట్లు,హిస్టరీ షీట్లు ఉన్న వారికి ఈరోజు ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ…

వివిధ నేరాల్లో నిందితులుగా ఉండి షీట్లు తెరువబడిన నేరచరితులు విధిగా పోలీసు వారు తెలిపిన సమయాల్లో పోలీస్ స్టేషన్ హాజరు కావాలని లేని పక్షంలో వారిని బైండోవర్ చేయడం జరుగుతుందని అన్నారు. రౌడీ,హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాలకు దూరంగా ఉండటంతో పాటు సత్ప్రవర్తనతో మెదులుతున్న వారిని గుర్తించి ఉన్న షీట్స్ ను తొలగించడం జరుగుతుందని వివరించారు. రౌడీ, హిస్టరీ అనుమానాస్పద, మతపరమైన అల్లర్లు లో ప్రమేయం ఉన్నవారిని ప్రతి నెల పోలీస్ స్టేషన్ కు పిలిపించి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏదైనా నేరానికి పాల్పడిన వారు ఎంతటివారైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ కి హాజరు అయిన వారి యొక్క వివరాలను, ఫోటోలను, సంతకలను తీసుకొని పంపించడం జరిగింది.