వర్షంలో 8 కిలోమీటర్లు పరుగెత్తి… మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్‌ డాగ్‌

వర్షంలో 8 కిలోమీటర్లు పరుగెత్తి… మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్‌ డాగ్‌

బెంగళూరు :

హత్యకు గురైన వ్యక్తి మృతదేహం వద్ద వాసన చూసిన పోలీస్‌ డాగ్‌ జోరు వానలో పరుగెత్తింది. 8 కిలోమీటర్లు పరుగుతీసి హంతకుడున్న ఇంటికి చేరింది. అతడు చంపబోతున్న ఒక మహిళ ప్రాణాలను కాపాడింది. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం రాత్రి 9.45 గంటల సమయంలో సంతబెన్నూరులోని పెట్రోలు బంక్‌ సమీపంలో హత్యకు గురైన ఒక వ్యక్తి మృతదేహాన్ని గస్తీ పోలీసులు గమనించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

కాగా, ఎస్పీ ఉమా ప్రశాంత్ వెంటనే స్పందించారు. పోలీస్‌ కుక్క తుంగ 2, దాని హ్యాండ్లర్‌ అయిన కానిస్టేబుల్ షఫీ, ఇతర పోలీస్‌ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపారు. డాబర్‌మ్యాన్ డాగ్‌ ఆ మృతదేహం వద్ద వాసన చూసింది. హంతకుడ్ని పసిగట్టేందుకు అక్కడి నుంచి పరుగుతీసింది. జోరు వానలో 8 కిలోమీటర్ల దూరం పరుగెత్తింది. చన్నాపురా గ్రామానికి చేరింది. పెద్దగా అరుపులు వినిపించిన ఒక ఇంటి వద్ద ఆ కుక్క ఆగింది. అక్కడ గట్టిగా మొరిగింది.

పోలీస్‌ డాగ్‌ను ఫాలో అయిన పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్ధలుకొట్టారు. ఒక మహిళను కొట్టి చంపుతున్న హంతకుడ్ని పట్టుకున్నారు. స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న ఆ మహిళను రక్షించారు.

మరోవైపు హత్యకు గురైన వ్యక్తిని 33 ఏళ్ల సంతోష్‌గా పోలీసులు గుర్తించారు. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో రంగస్వామి అతడ్ని హత్య చేసినట్లు తెలుసుకున్నారు. ఆ తర్వాత గ్రామానికి చేరుకున్న రంగస్వామి తన భార్య రూపను దారుణంగా కొట్టి చంపబోగా పోలీస్‌ కుక్క కాపాడిందని పోలీస్‌ అధికారి తెలిపారు. పోలీస్‌ డాగ్‌ తుంగ 2 సాహసాన్ని అంతా అభినందించారు.