మాటల మూటలే… సామాన్యులకు భారాలు… సంపన్నులకు వరాలు

మాటల మూటలే… సామాన్యులకు భారాలు… సంపన్నులకు వరాలు

ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సామాన్యులకు మాటల్లో .. కార్పొరేట్లకు మూటల్లో వడ్డించే మోడీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లోనూ అదే విన్యాసం చేసింది.

అండగా నిలిచిన వారికి మాత్రం దండిగా నిధులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా ఏడవసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ సామాన్యులకు ఉత్త మాటలే దక్కాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం లోక్‌సభలో ప్రతిపాదించిన 48,20,512 కోట్ల రూపాయల బడ్జెట్‌లో అధికభాగం కార్పొరేట్ల వైపే పరుగులు పెట్టింది. ఫలితంగా అత్యంత కీలకమైన వ్యవసాయం నుండి అన్ని రంగాల్లోనూ కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట దక్కింది.

నిరుద్యోగ నిర్మూలనకోసమంటూ అట్టహాసంగా ప్రకటించిన నూతన పథకాలను సైతం కార్పొరేట్ల ఖజనాలను నింపే వనరులుగా మార్చివేయడం మోడీ సర్కారు ప్రాధాన్యతలకు అద్దం పడుతోంది. ఈ పథకాల్లోనూ కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు శూన్యం! ఇంటర్న్‌షిప్‌లనే సర్వస్వంగా చిత్రించేందుకు ప్రయత్నించారు.

గరీబ్‌, మహిళా, యువ, అన్నదాత అని మాటలు చెబుతూనే, వారికిచ్చే సబ్సిడీలలో భారీగా కోతలు పెెట్టే వంచనాశిల్ప విద్యను కేంద్రం ప్రదర్శించింది. పెరిగిన ధరలతో నిరుపేదలు కుంగిపోతున్నా ఉపాధి హామీ నిధుల్లో అడ్డగోలు కోతను మోడీ సర్కారు కొనసాగించింది. అది చాలదన్నట్లు ఆహార సబ్సిడీ మీద 7,082 కోట్ల రూపాయల కోత పెట్టింది.

అంగన్‌వాడీలతో పాటు మాతా శిశు పథకాలకు అరకొర కేటాయింపులే దక్కాయి.

ఇక విద్య, వైద్యం గ్రామీణాభివృద్ధి రంగాలకు కూడా ద్రవ్యోల్బణాన్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా విదిలింపులతో సరిపెట్టారు. వేతన జీవులకు పెద్దగా ఊరట లభించలేదు. పేదలకిచ్చే సబ్సిడీలపై కోతలు పెట్టిన మోడీ ప్రభుత్వం అదే సమయంలో సంపదపైనా, వారసత్వపు ఆస్తులపైనా నామమాత్రపు పన్ను విధించడానికి కూడా సిద్దపడలేదు. ఫలితంగా రానున్న రోజుల్లో అంతరాలు మరింత పెరగనున్నాయి.

సామాన్యులకు మరిన్ని కష్టాలు, కన్నీళ్లు తప్పని స్థితి!

న్యూఢిల్లీ :

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం వరుసగా ఏడవసారి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశారు రికార్డును అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ ఇది. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా తొమ్మిది ప్రాధాన్యతాంశాలను పేర్కొన్నట్లు తెలిపారు. అవి వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపు, ఉపాధి, నైపుణ్యాల అభివృద్ధి, సమగ్ర మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం, తయారీ రంగం-సేవలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు తోడ్పాటు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక వసతులు, వినూత్న పరిశోధనలు-అభివృద్ధి రంగాలు, తదుపరి తరం సంస్కరణలని చెప్పారు.

మైనారిటీ పథకాలకు కోతలు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేటాయింపులు చాలా స్వల్పంగా 2.7శాతం మేరకే పెరిగాయి. అందులో కూడా పలు పథకాలకు కోతలు పడ్డాయి. మైనారిటీలకు కోచింగ్‌, ఇతర సంబంధిత పథకాలకు కేటాయింపులను ఈ ఏడాది రూ.30కోట్ల నుండి రూ.10కోట్లకు తగ్గించారు.

విదేశాల్లో చదువుకునే మైనారిటీ విద్యార్ధుల రుణాలపై ఇచ్చే వడ్డీ సబ్సిడీని కూడా తగ్గించారు. మదరసాలు, మైనారిటీల విద్యా పథకానికి ఇచ్చే బడ్జెట్‌కూడా దారుణంగా రూ.10కోట్ల నుండి రూ.2కోట్లకు తగ్గిపోయింది. రైల్వేలకు బడ్జెట్‌లో రూ.2.62 లక్షల కోట్లను కేటాయించారు. 40వేల కొత్తరైల్వే ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.

పన్ను శ్లాబ్‌లో మార్పులు పన్ను చెల్లింపుదారులకు మంచి వార్తను వినిపించారు. పన్ను శ్లాబుల్లో మార్పులను తీసుకువచ్చారు. స్టాండర్ట్‌ డిడక్షన్‌ను ప్రస్తుతమున్న రు.50వేల నుండి రు.75వేలకు పెంచారు. కొత్త పన్ను శ్లాబ్‌ల కింద ఆదాయపన్నులో రూ.17,500 వరకు ఉద్యోగులు ఆదా చేసుకోవచ్చని మంత్రి చెప్పారు.

పాత పన్ను వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఉపాధి హామీకి తగ్గిన నిధులు ఈసారి బడ్జెట్‌లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు తగ్గాయి. గతేడాది ఖర్చు పెట్టిన దానికన్నా తక్కువ మొత్తమే కేటాయించారు. ఇటీవలి ఎన్నికల్లో గ్రామీణ భారతంలో బిజెపి నష్టాలు చవిచూసినప్పటికీ ఈ పథకానికి కేటాయింపులు పెరగలేదు.

ఐటీ చట్టంపై సమగ్ర సమీక్ష ఐటీ చట్టంపై సమగ్ర సమీక్ష జరుపుతామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అందరూ అర్థమయ్యేలా చదువుకునేందుకు, వ్యాజ్యాల సంఖ్యను తగ్గించేందుకు ఈ సమీక్ష అవసరమని అన్నారు. స్టార్టప్‌ కంపెనీలకు ఊతమిచ్చేందుకు ఏంజెల్‌ పన్నును రద్దు చేస్తామని ఆమె ప్రతిపాదించారు. విదేశీ కంపెనీలపై కార్పొరేట్‌ పన్ను రేటును 40% నుండి 35%కి తగ్గిస్తామని తెలిపారు.

పూర్వోదయ పథకం బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం ‘పూర్వోదయ’ పథకాన్ని చేపడతామని ఆర్థిక మంత్రి చెప్పారు. బడ్జెట్‌లో మూలధనపు వ్యయ లక్ష్యాన్ని రూ.11.11 లక్షల కోట్లుగా చూపారు.

వ్యవసాయానికి రూ.1.5లక్షల కోట్లు ప్రకృతి వ్యవసాయంలోకి దేశవ్యాప్తంగా కోటిమంది రైతులను తీసుకురావాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఐదు రాష్ట్రాల్లో కిసాన్‌ క్రెడిట్‌ కార్టులను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి రూ.1.5లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

పప్పు ధాన్యాలు, నూనె విత్తనాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని, అధిక దిగుబడిని అందించే 109 నూతన వంగడాలను విడుదల చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

అవసరాన్ని బట్టి పది వేల బయో-ఇన్‌పుట్‌ రిసోర్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, వాటికి కేంద్రం చేయూత అందిస్తుందని చెప్పారు. సవరించిన అంచనాల ప్రకారం వ్యవసాయ మంత్రిత్వ శాఖకు రూ.1,16,788.96 కోట్లు కేటాయించారు.

బడ్జెట్‌లో మహిళలకేం చేశారంటే మహిళల నేతృత్వంలో అభివృద్ధి సాధనకు రూ.3లక్షలకు పైగా కోట్లతో పథకాలను తీసుకువచ్చారు.మహిళలకు కేటాయించినబడ్జెట్‌ను చూస్తే ఆర్థికాభివృద్ధిలో మహిళా సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వానికి గల నిబద్ధత తెలుస్తుందని మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

కార్మిక శక్తిలో మహిళల ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించేందుకు పరిశ్రమలతో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంటుందని, వర్కింగ్‌ వుమెన్‌ హాస్టళ్ళను ఏర్పాటు చేయడానికి, పిల్లల కోసం క్రెష్‌ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

పైగా మహిళల్లో నిర్దిష్ట నైపుణ్యాల అభివృద్ధికి, స్వయం సహాయక గ్రూపులకు మార్కెట్‌ సౌలభ్యాన్ని పెంచేందుకు కూడా పరిశ్రమలు-ప్రభుత్వం భాగస్వామ్యం ఉపయోగపడుతుందన్నారు. మహిళలు కొనుగోలు చేసిన ఆస్తులపై సుంకాలను కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. సామాజిక న్యాయానికి సంబంధించినంతవరకు అర్హులైన వారందరికీ వివిధ పథకాల ద్వారా లబ్ది పొందేలా చూడాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని చెప్పారు.

ఉపాధి, నైపుణ్యాలకు ప్రధానమంత్రి ప్యాకేజీ ఈపీఎఫ్ఓలో తొలిసారిగా నమోదైన ఉద్యోగులు ప్రభుత్వం నుండి మొదటి నెలలో రూ.15,000 వరకూ అదనపు జీతం పొందుతారు. ‘ప్రైమ్‌ మినిస్టర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ స్కిల్లింగ్‌’ పథకంలో భాగంగా ఈపీఎఫ్ఓలో తొలిసారి పేరు నమోదు చేసుకున్న ఉద్యోగులకు ఒక నెల జీతం అదనంగా అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.

ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో ఉద్యోగి బ్యాంక్‌ ఖాతాలో నేరుగా జమ చేస్తామని చెప్పారు. దీనివల్ల 2.10కోట్ల మంది యువత లబ్ది పొందుతారన్నారు. ఉపాధి, నైపుణ్యాల పెంపు, మధ్య తరగతి వర్గాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని ఆమె తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఈ ప్యాకేజీ కింద 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఇతర అవకాశాలు కల్పిస్తామని వివరించారు. ఇందుకోసం రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్య, ఉపాధి, నైపుణ్య చర్యల కోసం రూ.1.48 లక్షల కోట్లు అందజేస్తామని అన్నారు. ఈ ప్యాకేజీలోని ఐదు పథకాల్లో మూడింటికి ‘ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం’ (ఈఎల్ఐ) అని పేరు పెట్టామని, తొలిసారి ఉద్యోగి అయ్యే వారికి దీని కింద నెల జీతం అందిస్తామని తెలిపారు. తయారీ రంగంలో ఉపాధి కల్పనకు మరో పథకాన్ని ఉద్దేశించామని, ఉద్యోగితో పాటు యజమానికి కూడా వారి ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్‌ ఆధారంగా ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు.

ఉద్యోగం వచ్చిన మొదటి నాలుగు సంవత్సరాల వరకూ ఇది అమలులో ఉంటుందని అన్నారు. మూడవ పథకంలో యజమానులకు అవసరమైన మద్దతు అందిస్తామని నిర్మల తెలిపారు. ప్రతి అదనపు ఉద్యోగి కోసం ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్‌ కింద చెల్లించే వాటాలో రెండు సంవత్సరాల పాటు నెలకు రూ.3,000 చొప్పున రీయంబర్స్‌మెంట్‌ చేస్తామని చెప్పారు.

నాలుగో పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ సహకారంతో నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపడతామని అన్నారు. దీనికింద రాబోయే ఐదు సంవత్సరాల్లో 20 లక్షల మంది యువతకు శిక్షణ ఇస్తామని చెప్పారు.

ప్రధానమంత్రి ప్యాకేజీలో చివరి పథకంలో భాగంగా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తామని, రాబోయే ఐదు సంవత్సరాల్లో ఐదు వందల ప్రముఖ కంపెనీల్లో కోటి మందికి ఇంటర్న్‌షిప్‌ ఇస్తామని వివరించారు.ఏ ప్రభుత్వ పథకాల్లోనూ ఇప్పటివరకు లబ్ది పొందని విద్యార్ధులు దేశీయ విద్యా సంస్థల్లో చదువుకోవడానికి రూ.10లక్షల వరకు రుణాలు పొందుతారు.

విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం బడ్జెట్‌లో విద్యుత్‌ రంగానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

దేశంలో కోటి కుటుంబాలు నెలకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ పొందేందుకు వీలుగా ‘పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన’ కింద ఇంటి పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

ఉచిత సౌర విద్యుత్‌ వినియోగం కారణంగా కుటుంబాలు ఏటా రూ.15,000-18,000 కోట్లు ఆదా చేసుకోగలుగుతాయని, మిగులు విద్యుత్‌ను పంపిణీ కంపెనీలకు విక్రయించుకోవచ్చునని తెలిపారు.

2030 నాటికి శిలాజయేతర ఇంధన వనరుల నుండి 50 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధనాన్ని, విద్యుదుత్పత్తి స్థాపక సామర్ధ్యంలో యాభై శాతాన్ని పొందాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించారు.

ఈ బడ్జెట్‌లో విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు రూ.20,502 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మంత్రిత్వ శాఖ బడ్జెటరీ వ్యయం రూ.20,671.32 కోట్లు.

modi ఉత్ప్రేరక బడ్జెట్‌ భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చటానికి ఊతం భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చే ప్రక్రియలో బడ్జెట్‌ ఉత్ప్రేరకంగా పనిచేస్తోంది.

నేటి బడ్జెట్‌ కొత్త అవకాశాలు, కొత్త శక్తి, కొత్త ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను తీసుకొచ్చింది.

మెరుగైన వృద్ధిని, ఉజ్వల భవిష్యత్తును తెచ్చిపెట్టింది. భారత్‌’కు గట్టి పునాది వేస్తుంది. ఈ బడ్జెట్‌తో అందరికీ ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం…  ప్రధాని మోడీ

కుర్చీ బచావో బడ్జెట్‌rahul ఇది ముమ్మాటికి కుర్చీ బచావో బడ్జెట్‌.

కేవలం మిత్రపక్షాలను బుజ్జగించే చర్య. ఇతర రాష్ట్రాల ఖర్చుతో వారికి బూటకపు వాగ్దానాలు చేశారు.

ఆప్తమిత్రులను (క్రోనీలు) ప్రసన్నం చేసుకొనేలా రూపొందించారు. సామాన్య భారతీయులకు ఎలాంటి ఉపశమనం లేదు.

ఈ బడ్జెట్‌ గత బడ్జెట్‌ల కాపీ అండ్‌ పేస్ట్‌…. రాహుల్‌ గాందీ.