KTR సవాల్… దిగొచ్చిన సర్కార్…
ప్రతి రోజూ మేడిగడ్డ బరాజ్ నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించకుండా, రాజకీయాలు చేస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి రాజకీయం కోసం కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారు. అందుకే పంపులు నడపడంలేదు. ప్రభుత్వం స్పందించకపోతే మేడిగడ్డ, కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌లకు వేలాది రైతులతో వచ్చి పంపులను ప్రారంభిస్తాం.
రాష్ట్రంలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ (కన్నెపల్లి) నుంచి వెంటనే నీటి పంపింగ్‌ను ప్రారంభించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు.అసెంబ్లీ సమావేశాలు ముగిసే ఆగస్టు 2 వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని, అప్పటికీ లక్ష్మీ పంపుహౌస్ నుంచి నీటిని పంపింగ్ చేయకపోతే, 50 వేలమంది రైతులతో వచ్చి తామే ప్రారంభిస్తామని అల్టిమేటం జారీ చేశారు.
గోదావరి జలాలను బీడు భూములకు అందించాలన్న కేసీఆర్ సంకల్పాన్ని తామే నెరవేరుస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకుల బృందం రెండు రోజుల పాటు ఎగువ గోదావరి నుంచి దిగువ గోదావరి, ప్రాణహిత వరకు పర్యటించింది. ఇందులోభాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని-మంచిర్యాల బ్రిడ్జిపై నుంచి జలాలు లేక బోసిపోయిన గోదావరి నదిని పరిశీలించారు. అనంతరం మంచిర్యాల జిల్లా చెన్నూరు మీదుగా మహారాష్ట్రలోని సిరివంచ నుంచి జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి చేరుకున్నారు.
శుక్రవారం ఉదయం కాళేశ్వరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గోదావరి తీరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మి పంపుహౌస్ (కన్నెపల్లి), ఫోర్‌బేను పరిశీలించారు. ఆ తరువాత మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. లక్ష్మి పంప్‌హౌస్ వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతి రోజూ మేడిగడ్డ బరాజ్ నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించడంలేదని దుయ్యబట్టారు.
నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతుంటే ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి రాజకీయం కోసం కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని, అందుకే పంపులు నడపడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా చిల్లర విషప్రచారాలు మానుకోవాలని, రైతులకు నీళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నీళ్లు ఎత్తిపోసేందుకు అన్నీ సక్రమంగా ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై శాసనసభ, శాసనమండలిలో ఎండగడతామని స్పష్టంచేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మేడిగడ్డ, కన్నెపల్లి లక్ష్మీపంపుహౌస్‌లకు యాభై వేల మంది రైతులతో వచ్చి పంపులను ప్రారంభిస్తామని హెచ్చరించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని కేటీఆర్ చెప్పారు. కాలంతో పోటీ పడుతూ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించిందని గుర్తుచేశారు. తెలంగాణలో మళ్లీ కరువు అనే మాట వినపడకూదనే కేసీఆర్ ముందుచూపు, అఖండమైన సంకల్పబలం, దైవబలంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నామని చెప్పారు. కాళేశ్వరం కామధేనువు, కల్పతరువు లాంటి ప్రాజెక్టు అని కొనియాడారు. వంద విభాగాలు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక చిన్న సంఘటన పట్టుకుని మేడిగడ్డలో జరిగిన దానిని భూతద్దంలో చూపించి మొత్తం ప్రాజెక్టును బద్నాం చేసి, రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూశారని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయని, అనవసరంగా రాజకీయ రచ్చ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. రైతుల కోసం కలిసికట్టుగా పనిచేద్దామని కోరారు. అన్నారం, సుందిళ్లలో గ్రౌటింగ్ చేశారా? అని అధికారులును అడిగితే… రెగ్యులర్‌గా జరిగేవేనని, ఎలాంటి ఇబ్బందులు లేవని తమతో చెప్పారని కేటీఆర్ వివరించారు.
‘పుష్కరఘాట్‌లో నీళ్లు ఉధృతంగా కిందికి వృథాగా పోతున్నాయి. పైన ఎల్‌ఎండీ, ఎంఎండీ మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్, అన్నపూర్ణసాగర్ ఎండిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ పంచభక్ష పరమాన్నం వడిస్తే కాంగ్రెసోళ్లకు వాడుకునే తెలివిలేదు’ అని కేటీఆర్ దుయ్యబట్టారు. రోజుకు రెండుమూడు టీఎంసీల నీళ్లు ఎత్తిపోయొచ్చని, అయితే రాజకీయ కారణాలతో ఇంజినీర్లు ఏమీ చేయలేకపోతున్నారని చెప్పారు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని, ఎస్సారెస్పీ కెనాల్ నింపవచ్చని పేర్కొన్నారు. ‘నీళ్లు సముద్రంలోకి వృథా గా పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నది. నీళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభు త్వ చిత్తశుద్ధిని ప్రజలు, రైతులు అనుమానిస్తున్నారు. వెంటనే రెండు టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తే రిజర్వాయర్లకు చేరుకుంటాయి. ఆరు నెలలు రాజకీయాలు చేద్దాం. నాలుగు నెలలు ప్రజలు, రైతుల కోసం కొట్లాడుదాం. నీటి పంపింగ్‌పై ఎందుకు నిర్ణయం తీసుకోవడంలేదో ప్రభుత్వం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.అన్నపూర్ణ రిజర్వాయర్, కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్‌లకు వేరే ప్రత్యామ్నాయంలేదని స్పష్టంచేశారు. ఇక్కడి నుంచే నీళ్లు నింపుకోవాల్సిన పరిస్థితి ఉన్నదని వివరించారు. ‘మిడ్‌మానేరు ఎండిపోయింది. తుంగతుర్తి, కోదాడ, పాలేరు, భువనగిరి, ఆలేరు ప్రజలు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. వెంటనే లక్ష్మీ పంపుహౌస్‌ను ప్రారంభించాలి. లక్షలాది ఎకరాలకు నీరిచ్చే ఆయకట్టు, రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఎందుకు ఎండకడుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో సాగునీరు, తాగునీరుకు ఆధారమైన గోదావరి నీళ్లు ఇప్పుడు ఏ ప్రాజెక్టులోకి కూడా రాలేదని, ఇప్పటికిప్పుడు వచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఎగువన మహారాష్ట్ర నుంచి శ్రీరాంప్రాజెక్టు మీదికి గోదావరి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. లోయర్ మానేరు డ్యాంలో డెడ్‌స్టోరేజీ 3 టీఎంసీలు. ఇప్పుడు అక్కడ 2 టీఎంసీలు మాత్రమే ఎక్కువగా ఉన్నయి. ఎల్‌ఎండీలో 5 టీఎంసీలు, మిడ్‌మ్యానేరులో 5 టీఎంసీలే ఉన్నయి. శ్రీరాంసాగర్‌లో 25 టీఎంసీల కంటే తక్కువగా ఉన్నయి. పైనుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు కట్టడం వల్ల శ్రీరాంసాగర్‌కు నీళ్లు రావడంలేదు. ఒకప్పుడు కరువు ఉన్న సిద్దిపేట, సిరిసిల్ల, మానకొండూరు, చొప్పదండి, హుస్నాబాద్, గజ్వేల్, ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కట్టుకున్నాం. మిడ్‌మానేరు, రాజరాజేశ్వరసాగర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌తో నీటిని నిల్వ చేసుకున్నాం. హైదరాబాద్‌కు మంచినీళ్లు అందించే మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్మించుకున్నాం. హైదరాబాద్‌కు, వ్యవసాయానికి ఉపయోగపడేవిధంగా 50 టీఎంసీలతో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, అన్నపూర్ణ, రాజరాజేశ్వరసాగర్ మిడ్‌మానేరు నిర్మించుకున్నాం. ఇన్ని ప్రాంతాలకు నీళ్లను అందించే కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంపుహౌజ్ (కన్నెపల్లి) నుంచి నీళ్లను ఎత్తిపోయవచ్చా? అని ఇంజినీర్లను, ఎల్‌ఎండీ, మున్సిపల్ అధికారులను అడిగాం. కరీంనగర్ పట్టణంతోపాటు చుట్టుపక్కలవారిని, రైతులను పలకరిస్తే మూడురోజులకోసారి మంచినీళ్లు ఇస్తున్నారని, వర్షాలు సరిగ్గాలేవని, కరువు పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉన్నదని అన్నారు. కాంగ్రెసోళ్లు పంపులు ఆన్ చేయడంలేదని, రిజర్వాయర్లలో నీళ్లు కనిపించడంలేదని రైతులు, ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ సార్ ఉన్నాళ్లు నీళ్లు ఇచ్చారని ఇప్పుడు నీళ్లు లేక దౌర్భాగ్యపరిస్థితి ఉన్నదని బాధపడుతున్నారు. ఎల్‌ఎండీ,ఎంఎండీ, ప్రతి రిజర్వాయర్ నిండుకొండలా కనిపించేదని ఇప్పుడు ఎండిపోయి ఉన్నాయని ప్రజలు చెప్తున్నారు’ అని కేటీఆర్ వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో సాగు, తాగు నీటి సమస్య తీవ్రతరమైందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో కాళేశ్వరం నుంచి నీటిని పంపింగ్ చేయడం లేదని మండిపడ్డారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ఒక మోటరును రన్ చేసినా ఎల్‌ఎండీ, ఎంఎండీకి నీళ్లు వచ్చేవని చెప్పారు. వెంటనే ప్రభుత్వం కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటర్లను రన్ చేసి నీటిని ఎల్‌ఎండీకి తరలించాలని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసేదంతా దుష్ర్పచారమేనని, రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ మం త్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. కన్నెపల్లి పం ప్‌హౌస్‌లో మోటర్లు రన్ చేసి నీళ్లు ఇస్తే వాళ్ల బాగోతం బయటపడుతుందనే భయంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నదని, గతంలో 28 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవహించినా కాళేశ్వరం ప్రాజెక్టు చెక్కు చెదరలేదని చెప్పారు. ఒక్క పిల్లర్ కుంగితేనే కాంగ్రెస్ నేతలు దుష్ర్పచారం చేసి రాక్షసానందం పొందారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ కేసీఆర్‌ను బదనాం చేయాలనే కుట్రలు కాంగ్రెస్ చేస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనను మానుకుని రైతులకు సాగు నీరు అందించాలని కోరారు.
పెద్దపల్లి, జూలై 26 కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధి బృందం శుక్రవారం కాళేశ్వరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసింది. ఇదే సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకున్నది. తరచూ కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుమే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నందీశ్వరుడి వద్దకు వచ్చారు. నందీశ్వరుడి ఒక చెవి మూసి, మరో చెవిలో ఏదో చెప్పారు. అదే సమయంలో కేటీఆర్ అక్కడికి రాగా.. ‘మనసులో ఏమనుకుంటున్నావో.. ఈ నందీశ్వరుడికి చెప్పు.. తప్పక నెరవేరుతది.. ఈ నందీశ్వరుడి కొమ్ములపై చెయ్యి పెట్టి కాళేశ్వరుడిని చూడు అంతా మేలైతది..’ అని మల్లారెడ్డి ఆహ్వానించడంతో.. వెంటనే కేటీఆర్ ‘చెవిలో చెప్పాలా..’ అంటూ నందీశ్వరుడి కొమ్ములపై చేయిపెట్టి కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని చూశారు. కాళేశ్వరం జలాలు రాష్ట్రమంతా సస్యశ్యామలం చేయాలని, రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు ప్రతినిధి బృందం వెల్లడించింది.
కేటీఆర్ బృందం శుక్రవారం ఉదయం రామగుండం నుంచి చెన్నూరు మీదుగా కాళేశ్వరానికి చే రుకున్నారు. కాళేశ్వరం బ్రిడ్జిపై ఆగి కాళేశ్వరం వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయానికి చేరుకొని, పూజలు చేశారు. అక్కడినుంచి గోదావరి నది తీరం పుష్కరఘాట్ వద్ద త్రివేణి సంగమంలో గోదావరికి పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అనంతరం కన్నెపల్లి పంపుహౌస్, ఫోర్‌బే, మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటర్ల స్థితిగతులను కేటీఆర్ అక్కడ ఉన్న ఎస్‌ఈ కరుణాకర్, ఈఈ తిరుపతిరావును అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ వద్ద రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు పోతున్నదని, అన్నారం బరాజ్ నుంచి సుమారు 14 వేల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ వైపు వదులుతున్నామని ఎస్‌ఈ, ఈఈలు కేటీఆర్‌కు వివరించారు. నీటిని నిల్వ చేయకుండానే 17 పంపులతో ప్రస్తుతం రోజు కు మూడు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయొచ్చని తెలిపారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో నీటిని పంపింగ్ చేయడం లేదని అధికారులు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు క్యాతనపల్లి మున్సిపాలిటీలోని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వగృహానికి చేరుకున్నారు. అక్కడ భోజనం చేసి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. పర్యటనలో మాజీ మంత్రులు మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సునీత ల క్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్‌కుమార్, పల్ల రాజేశ్వర్‌రెడ్డి, విజయుడు, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు వాణీదేవి, నవీన్‌కుమార్, ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమ న్, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్‌ఎస్ నేతలు చిరుమల్ల రాఖేశ్, జక్కు రాకేశ్, దాసరి ఉష ఉన్నారు.
కేసీఆర్ సర్కారులో గోదావరి నిండుకుండలా కళకళలాడిందని, ఇప్పుడు ఎండిపోయి ఎడారిగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. మేడిగడ్డ సందర్శనలో భాగంగా గురువారం ఆయన ఎన్టీపీసీ రామగుండంలో బస చేశారు. శుక్రవారం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యెలతో కలిసి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం మీదుగా మేడిగడ్డకు వెళ్తూ.. గోదావరి బ్రిడ్జిపై ఆగారు. గతంలో ఎట్లున్న గోదావరి నది.. ఇప్పుడు ఎట్లయ్యిందని ఆవేదన వ్యక్తంచేశారు. వనరులను సద్వినియోగం చేసుకోలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు.