జగన్ ను కలుపుకేళ్దాం… కాంగ్రెస్ ముందు ప్రతిపాదన…? రేపు కీలక బేటి

బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు కానుంది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరుగనుంది.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ సహా ఆ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

ఇండియా కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరొచ్చంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నెల 24వ తేదీన దేశ రాజధానిలో నిర్వహించిన ఆందోళనకు కాంగ్రెసేతర విపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ ఈ ఆందోళనకు హాజరు కాలేదు. తన ప్రతినిధులుగా ఎవ్వరినీ పంపించలేదు.

ఇండియా కూటమిలో వైఎస్ జగన్‌ చేరాలంటూ డీఎంకేకు చెందిన ఎంపీ తిరుమావళన్ సహా మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మల్లికార్జున్ ఖర్గేకు సైతం వాళ్లు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలపై పార్లమెంటరీ పార్టీలో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.