హనీ ట్రాప్…!! రూటు మార్చిన సైబర్​ నేరగాళ్లు – ఇప్పుడు వృద్ధులే టార్గెట్…!!

హనీ ట్రాప్…!! రూటు మార్చిన సైబర్​ నేరగాళ్లు – ఇప్పుడు వృద్ధులే టార్గెట్…!!

మోసపోయిన వాళ్ళ స్టోరీస్ ఏంటి అంటే?

సోషల్ మీడియాలో యువతుల తియ్యని మాటలు విని, నిజమేననుకొని నమ్మి కాల్‌ చేసి మోసిపోయిన వారు ఎందరో.

న్యూడ్‌ కాల్స్‌ పేరుతో నిలువు దోపిడీ ఉదంతాలు ఎన్నో. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులే వీరి లక్ష్యం.

కానీ తాజాగా రూటు మార్చిన అమ్మాయిలు వృద్ధులకు ఎర వేస్తున్నారు. వీరి వలకు చిక్కిన వృద్ధులు విలవిలలాడుతున్నారు.

ఇటీవల కృష్ణా జిల్లా పెనమలూరు ప్రాంతానికి చెందిన పలువురు వృద్ధులు వీరి బారిన పడిన ఉదంతాలే ఇందుకు ఉదాహరణ.

పరువుపోతుందని రూ.7 లక్షలు పంపారు…

ఆయన కానూరుకు చెందిన ఓ విశ్రాంత ప్రభుత్వ అధికారి (67). రెండు నెలల కిందట ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. లిఫ్ట్‌ చేయగానే స్క్రీన్‌పై ఓ అందమైన భామ ప్రత్యక్షమై తనను పరిచయం చేసుకుంది. తన భర్త దుబాయ్‌లో ఉంటారని, మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చి మూడ్రోజుల్లోనే వెళ్లిపోతారంటూ పేర్కొంటూ మాటలు కలుపుతూ తన ఒంటిపై వస్త్రాలను ఒక్కొక్కటిగా విప్పి పక్కన పడేసింది. అనంతరం రేపు మాట్లాడాతానంటూ ఫోన్‌ కట్‌ చేసిన పావుగంటకు వాట్సప్‌లో ఓ వీడియో వచ్చింది. అది కూడా ఆమె ఫోన్‌ నంబరు నుంచి రావడంతో అధికారి దానిని తెరిచారు. అది ఆమెతో జరిపిన నగ్న వీడియోకాల్‌ కావడంతో బెంబేలెత్తిపోయాడు.

ఈలోగా మరో ఫోన్‌ వచ్చింది. ఈసారి తాను ముంబయికి చెందిన ఏసీపీనంటూ పోలీస్‌ డ్రస్‌లో ఉన్న ఓ అధికారి వీడియో కాల్‌లో ప్రత్యక్షమయ్యాడు. మహిళలకు ఫోన్లు చేసి నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడమని బెదిరిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, మీపై కేసు కట్టి అరెస్టు చేయడానికి వస్తున్నానంటూ చెప్పడంతో విశ్రాంత అధికారి భయపడిపోయి తన పరువుపోతుందని బతిమిలాడాడు. అరెస్టు కాకుండా ఉండాలంటే రూ.7 లక్షలు తాము చెప్పిన ఖాతాకు పంపాలనడంతో ఆ మొత్తాన్ని పంపారు. నాలుగు రోజుల తరువాత తనకు వచ్చిన ఫోన్‌కాల్స్‌పై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా అక్కడ తనలాగే మోసపోయిన మరో ముగ్గురు వృద్ధులు తారసపడడంతో అవాక్కయ్యారు.

మీతో పిల్లలు కలిగితే మహర్జాతకులు అవుతారు…

పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన ఓ వడ్డీ వ్యాపారి(70) పిల్లలు విదేశాల్లో స్థిరపడగా భార్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. ఓ రోజు రాత్రి ఇతడికి ఓ వీడియోకాల్‌ వచ్చింది. అందులో అందమైన మహిళ తెరపై ప్రత్యక్షమై తనది మహారాష్ట్ర అని, తన భర్తతో తనకు పిల్లలు లేరని మీ పేరు జాతకం ఉన్న వ్యక్తులతో పిల్లలు కలిగితే వారు మహర్జాతకులు అవుతారనని జ్యోతిష్కుడు తెలిపారంటూ మనసులో మాట బయటపెట్టింది.

ఇదే విధంగా నాలుగు రోజులు సాగిన వీరి వీడియోకాల్‌ సంభాషణలకు ఐదో రోజు బ్రేకు పడింది. అనంతరం ఈయనకు వాట్సప్‌లో వచ్చిన ఓ వీడియోకాల్‌లో ఆమెతో మాట్లాడిన దృశ్యాలు ఉండడంతో అతడు కంగుతిన్నాడు. తనకు వెంటనే రూ.10 లక్షలు పంపకపోతే తాను పోలీస్‌ కేసు పెడతానంటూ ఆమె బెదిరించడంతో పరువుపోతుందనే భయంతో అతడు ఆ మొత్తాన్ని ఆమెకు రెండు విడతల్లో పంపాడు. చివరకు ఓ పోలీస్‌ అధికారికి తన మొర వినిపించి ఆమె ఉచ్చులోంచి బయటపడ్డాడు.

లక్షల్లో వదిలించుకున్న మరో వృద్ధుడు…

పోరంకికి చెందిన వృద్ధుడైన ఓ వ్యాపారి ఇటీవల ఓ యువతితో వీడియోకాల్‌లో సంభాషించి రూ.లక్షల్లో చెల్లించుకున్నాడు. తనను కాపాడలంటూ స్నేహితులతో మొరపెట్టుకొని వారి సలహా మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసి హనీట్రాప్‌ ఉచ్చులోంచి బయటపడ్డాడు.

ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు మా దృష్టికి వస్తున్నాయని పెనమలూరు సీఐ టీవీవీ రామారావు తెలపారు. అనేక మంది బాధితులు ఈ ఉచ్చులో పడి రూ.లక్షలు పోగొట్టుకొంటున్నారని, పాకిస్థాన్‌ వంటి కొన్ని దేశాల నుంచి వచ్చే అనుమానిత వీడియోకాల్స్‌ను లిఫ్ట్‌ చేయకూడదని సూచించారు. లిఫ్ట్‌ చేసినా వారితో ఎక్కువ సేపు మాట్లాడకూడదని, మన దేశంలోనూ ఈ తరహా ఫోన్లు చేసే వారున్నారని, అప్రమత్తంగా ఉంటూ సకాలంలో పోలీసులకు సమాచారం అందిస్తే హనీట్రాప్‌ ఉచ్చులో చిక్కుకోకుండా ఉండవచ్చని అన్నారు.