LRS కు పచ్చజెండా… నేటి నుంచి కార్యాచరణ… పెండింగ్ దరఖాస్తులకు మోక్షం
మూణ్నెల్లలో క్షేత్రస్థాయి పరిశీలన.. అంతా ఆన్‌లైన్‌లోనే..
నాలుగు దశల్లో వడపోత.. అనుమతికి సర్కారు ఉత్తర్వులు
4 ఏళ్ల నిరీక్షణకు తెర.. నేడు అధికారులతో సీఎస్ సమీక్ష
హైదరాబాద్ :
లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని(ఎల్‌ఆర్‌ఎస్) ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. గురువారం నుంచి ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభమవ్వనుంది. మూణ్నెల్లలో క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తిచేసుకునేలా.. నాలుగు దశల్లో ఈ దరఖాస్తుల స్ర్కూటినీ జరగాలని నిర్దేశిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. గ్రామ పంచాయతీ మొదలు.. జీహెచ్‌ఎంసీ దాకా సిబ్బంది, ఉన్నతాధికారులకు ఇందుకు సంబంధించిన విధులను నిర్దేశించింది. దీంతో 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న 25 లక్షల దరఖాస్తులకు మోక్షం కలగనుంది.
నాలుగు దశల్లో వడపోత…
పెండింగ్/కొత్త దరఖాస్తులను సుపరిపాలన కేంద్రం(సీజీజీ) రూపొందించిన అప్లికేషన్ ద్వారా పరిశీలిస్తారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో దరఖాస్తులను నిషేధిత భూములతో పోల్చి.. ఒకవేళ ఆ జాబితాలో ఉంటే తిరస్కరిస్తారు. ఆ తర్వాత సంబంధిత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, నీటిపారుదల శాఖ ఏఈ, టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ లేదా పంచాయతీ ఈవో లేదా స్థానిక సంస్థల సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. దరఖాస్తులో పేర్కొన్న భూములు ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్ భూములు, జలవనరుల ఫిల్ ట్యాంక్ లెవెల్(ఎ్‌ఫటీఎల్)లో ఉన్నాయా? అనే విషయాన్ని పరిశీలిస్తారు. వీరి వద్ద ఉండే మొబైల్ యాప్ ద్వారా జీపీఎస్ వివరాలతోపాటు స్ర్కూటినీ చేస్తారు. వీరు పంపే దరఖాస్తులను నీటిపారుదల, రెవెన్యూ లేదా టౌన్‌ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ముగ్గురూ ఆయా దరఖాస్తులను తిరస్కరించవచ్చు లేదా ఆమోదించవచ్చు లేదా మార్పులతో మరోసారి దరఖాస్తుకు ఆదేశించవచ్చు. ఈ దశలో వడపోత తర్వాత డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు పరిశీలిస్తారు.
రెండో దశకు చేరుకునే దరఖాస్తులను టౌన్‌ప్లానింగ్ అధికారులు లేదా పంచాయతీ అధికారులు మాస్టర్‌ప్లాన్, రోడ్ల విస్తరణ నిబంధనలు, జోన్ నిబంధనలు, ఖాళీ స్థలాల వివరాలను పరిశీలించి.. అన్నీ సవ్యంగా ఉంటే.. లేఅవుట్లకు ఫీజును నిర్ణయిస్తారు. దరఖాస్తుదారులు నిర్ణీత ఫీజును చెల్లించాక.. మూడోదశ వడపోతకు దరఖాస్తులు వెళ్తాయి.మూడో దశకు చేరిన దరఖాస్తులను మునిసిపల్ కమిషనర్లు, పట్టణాభివృద్ధి సంస్థల వైస్ చైర్మన్లు, అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు) పరిశీలిస్తారు. దరఖాస్తులో లోపాలుంటే తిరస్కరిస్తారు. వీరు ఆమోదించే దరఖాస్తులు నాలుగోదశకు చేరుతాయి.నాలుగోదశలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు.. జిల్లాల్లో కలెక్టర్లు పరిశీలించి ఆమోదిస్తారు. ఈ అన్ని దశల్లో క్షేత్రస్థాయి బృందం ఇచ్చే నివేదిక అత్యంత కీలకమైనది.
నేడు సీఎస్ సమీక్ష…
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గురువారం సమీక్ష నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమీక్షలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు, కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్, రెవెన్యూ, నీటిపారుదల అధికారులకు సీఎస్ సూచనలు చేయనున్నారు. మునిసిపాలిటీలు, జిల్లాల స్థాయిలో హెల్ప్‌డె్‌స్కల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేయనున్నారు.