మా స్థానంలో కూర్చోండి… ఎంత ఒత్తిడి ఉందో తెలుస్తుంది..! న్యాయవాదిపై ‘సుప్రీం’ సీజేఐ ఆగ్రహం…!!
న్యాయవాదులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులు ఒక రోజు తమ స్థానంలో కూర్చోవాలని.. అప్పుడు తమపై ఉన్న ఒత్తిడి తెలిసి వస్తుందంటూ ఘాటుగా స్పందించారు. ఓ కేసులో న్యాయవాది విచారణ ఆలస్యమవుతోందని.. ముందుగా విచారణ చేపట్టాలని, తేదీని చెప్పాలని కోరగా.. దాంతో సీజేఐ మండిపడ్డారు. కోర్టుకు ఆదేశాలు జారీ చేయొద్దంటూ హెచ్చరించారు. మంగళవారం సుప్రీంకోర్టులో మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలు, ఎన్‌సీపీ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై విచారణ జరిగింది. ఎమ్మెల్యే అనర్హత కేసులో శాసన సభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శివసేన యూబీటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసు విచారణ మంగళవారం సుప్రీంకోర్టుల విచారణకు వచ్చింది. అయితే, త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కేసు విచారణను త్వరగా విచారించాలని కోర్టును కోరారు. ఎన్నికలకు సమీపిస్తున్నందున విచారణ తేదీని నిర్ణయించాలని కోరారు. ప్రతివాదులు డాక్యుమెంట్ల పరిశీలన కోసం కొంత సమయం కావాలని కోరారు. దీంతో కోర్టు గురువారం వరకు సమయం ఇచ్చింది. దీంతో శివసేన యూబీటీ తరఫు న్యాయవాది అంతకన్నా ముందే విచారణ జరపాలని కోరారు. ఈ క్రమంలో అసహనానికి గురైన సీజేఐ సదరు న్యాయవాదిపై మండిపడ్డారు. న్యాయమూర్తులకు ఆదేశాలు ఇవ్వొద్దన్నారు. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టం వచ్చిన తేదీ కావాలని డిమాండ్ చేస్తున్నారని.. కోర్టుపై ఎంత ఒత్తిడి ఉందో మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. న్యాయవాదులు ఒకరోజు తమ స్థానాల్లో కూర్చోవాలని.. అప్పుడు తమపై ఉన్న ఒత్తిడి తెలుస్తుందన్నారు.
కోర్టుపై ఒత్తిడి తేవొద్దని.. ప్రతి కేసును విచారిస్తామని స్పష్టం చేశారు. తమపై ఉన్న పని ఒత్తిడిని అర్థం చేసుకోవాలని చెప్పారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు పలువురు ఉద్దవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అలాగే శరద్ పవర్ ఎన్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం తిరుగుబాటు చేసి ప్రభుత్వం చేరిన విషయం తెలిసిందే. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరించారు. దాంతో రెండు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ విషయంలో అజిత్ పవార్ గ్రూప్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా అజిత్ వర్గం సమాధానం చెప్పేందుకు మూడువారాలు గడువు కోరింది. ఈ మేరకు కోర్టు అనుమతి ఇచ్చింది..