రుణ మాఫీ సొమ్ము నొక్కేసిన బ్యాంక్ ఉద్యోగి…!
బ్యాంకును నమ్మి వచ్చే ఖాతాదారుల సొమ్ము ఆ బ్యాంక్ లోనే అక్రమార్కులు స్వాహా చేసేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను టార్గెట్ చేసుకుని కుచ్చుటోపి పెట్టేశారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై గుట్టుగా ఖాతాదారుల సొమ్మును లక్షల రూపాయలు స్వంతంగా వాడుకున్నాడు. బ్యాంక్‌లో పనిచేసే బిజినెస్ కోఆర్డినేటర్. విషయం తెలుసుకున్న బ్యాంక్ ఖాతాదారులు లబోదిబోమంటున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాముల గ్రామంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతాదారులను మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. బ్యాంక్‌లో బిజినెస్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్న దేవేందర్ అనే వ్యక్తి అమాయక ఖాతాదారుల సొమ్మును హాంఫట్ చేశాడు. గ్రామాల నుంచి వచ్చే నిరక్షరాస్యులైన కస్టమర్స్ ను మోసం చేస్తూ వారి సొమ్మును సొంతానికి వాడుకున్నాడు. ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై ఖాతాదారుల రుణాలను నొక్కేశాడు.
బంగారు రుణాలు, క్రాప్ లోన్లను అసరాగా చేసుకొని లక్షల రూపాయలు మాయం చేశాడు దేవెందర్. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఖాతాదారులకు మాయమాటలు చెప్పి వారికి సహాయం చేసినట్లుగా నటించి వారి సొమ్మును మింగేశాడు. పూర్తిగా రుణాలు చెల్లించే రుణాలను రీ షెడ్యుల్ చేసి ఆ రుణాన్ని తన్నుకుపోయిన ఘటనలు చాలానే వెలుగు చూశాయి. బ్యాంక్ అధికారులకు సంబంధించిన ఐడిలు ప్రైవేటు వ్యక్తిగా ఉన్న బిజినెస్ కో ఆర్డినేటర్ కు ఇవ్వడం ద్వారా అమాయక ప్రజలను ఈజిగా బురిడీ కొట్టించాడు.