రూ.100 కోట్ల విలువ చేసే భూదాన్ భూములకు ఎసరు…!!!
వెలుగులోకి మేడ్చల్ ఎమ్మార్వో శైలజ నిర్వాకం.
నిషేధిత జాబితాలో ఉన్న 5.04 ఎకరాల భూదాన్ భూమిని పట్టా భూమిగా మార్చే కుట్ర.
భూదాన్ యజ్ఞబోర్డు అథారిటీ నుంచి క్లారిఫికేషన్ తీసుకోకుండానే కలెక్టర్‌కు సిఫారసు చేసిన వైనం.
ఎమ్మార్వో తీరుపై అనుమానంతో హోల్డ్‌లో పెట్టిన కలెక్టర్.
అంతర్గత విచారణలో భూదాన్ భూమిగా తేలడంతో నివ్వెరపోయిన కలెక్టర్.
ఓ వైపు ఏసీబీ రైడ్స్ జరుగుతున్నా రెవెన్యూ శాఖలోని అవినీతి అధికారులలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఇలాంటి అధికారుల కారణంగా ఇప్పటికే అత్యంత విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి..
నగర శివరులో రూ.100 కోట్ల విలువైన భూదాన్ భూమిని పట్టా భూమిగా మార్చేందుకు ఆ ఎమ్మార్వో ఏకంగా ఆర్డీవోను బురిడీ కొట్టించి జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్వోసీ తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ కలెక్టర్ చాకచక్యంగా వ్యవహరించి తహసీల్దార్ సిఫారసులను హోల్డ్ చేయడంతో విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు చేరకుండా ఆగింది. వంద కోట్ల విలువైన భూదాన్ భూమిని ధారాదత్తం చేసేందుకు మేడ్చల్ ఎమ్మార్వో శైలజ చేసిన కుట్రలపై మేడ్చల్ రెవెన్యూ అధికారులలో జోరుగా చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో అమలులో ఉన్న ఆర్ఓఆర్ యాక్ట్ – 2020 ప్రకారం తహసీల్దార్ కోర్టులు రద్దు కావడంతో 2022 నవంబర్ 25న వచ్చిన ఈ ఆర్డర్ పై గతంలో మేడ్చల్ తహసీల్దార్లుగా పనిచేసిన వారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే రెవెన్యూ రికార్డులలో సర్వే నంబర్ 185లో 5.04 ఎకరాల భూమి భూదాన్ భూమిగా నమోదై ఉండడంతో తహసీల్దార్లు ఆ భూమి జోలికి వెళ్లలేదు. కానీ మొన్నటి ఎన్నికల తరువాత మేడ్చల్ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన శైలజ ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసే బాధ్యతను తీసుకున్నారు.