కూతురుతో కలిసి యువ జర్నలిస్టు యోగి ఆత్మహత్య…!!
వరంగల్ జర్నలిస్టు వర్గాల్లో విషాదం
వరంగల్ యువ జర్నలిస్ట్, తొలి వెలుగు చానెల్ రిపోర్టర్ గా పనిచేస్తున్న యోగి రెడ్డి తన కూతురు ఆద్య(9)తో కలిసి హన్మకొండ ఏకశిల పార్కుకు సమీపంలోని తన ఇంట్లో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అతను సంఘటన స్థలంలోనే మృతి చెందగా కూతురు ఆద్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. హన్మకొండలోని ఏకశిలా పార్కుకు సమీపంలో అద్దె రూంలో ఉంటున్న యోగి..శుక్రవారం ఉదయం నుంచే రూం నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం యోగి సన్నిహితులు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో ఎంత పిలిచినా స్పందించకపోవడంతో అనుమానంతో తలుపులు తొలగించి చూశారు. యోగి ప్రాణాలు కోల్పోయి కనిపించగా, అపస్మారక స్థితిలో ఉన్న ఆయన కూతురును కొంతమంది జర్నలిస్టులు, సన్నిహితులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. యోగి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనే విషయంపై స్పష్టత లేదు. కుటుంబ సమస్యలే కారణమా..? మరేదైనా ఉందా? అన్నది తెలియాల్సి ఉంది.
అగ్రసివ్ జర్నలిస్ట్..!
జర్నలిజంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న యోగి రెడ్డికి మంచి పేరు ఉంది. అగ్రసివ్గా ఉండేవాడు. జర్నలిస్టుల సమస్యలపై గళం వినిపించేవాడు. సామాజిక మాధ్యమాల్లోనూ తరుచూ జర్నలిస్టుల సమస్యలపై చర్చ పెట్టేవాడు. జర్నలిస్టుల సమస్యల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమంటూ పలుమార్లు ప్రకటించాడు. యోగి ఆత్మహత్య ఘటనతో ఓరుగల్లు జర్నలిస్టులు షాక్కు గురయ్యారు. యోగితో సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం
వరంగల్ జిల్లా యువ జర్నలిస్టు యోగిరెడ్డి తన కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకోవడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య విచారం వ్యక్తం చేశారు. యోగి మృతికి వారు సంతాపం తెలియజేస్తూ,ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.