తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్… నిర్ణయం…?
ఆయా రాష్ట్రాల్లో పార్టీ ప్రక్షాళన దిశగా ఏఐసీసీ కీలక సమావేశం నిర్వహించబోతోంది.
ఎనిమిది రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ లను మార్చాలని నిర్ణయించిన హైకమాండ్..
మంగళవారం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై చర్చించడంతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.
కీలకమైన ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతోపాటు ఆయా రాష్ట్రాల ఇంచార్జ్ లు, సీనియర్ నేతలు హజరు కానుండటంతో ఈ సమావేశంలో ఏఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మరికొద్ది నెలల్లోనే మహారాష్ట్ర, జార్ఖండ్ , హర్యానాతోపాటు జమ్మూ కాశ్మీర్ లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, వచ్చే ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.
దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడం, ఎన్నికలకు పొత్తులతో వెళ్లడమా? లేక ఒంటరిగానే ముందుకు వెళ్లడమా అనే అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు.. గత కొద్ది నెలలుగా పీసీసీల మార్పుపై అధిష్టానం కసరత్తు చేస్తున్నా ఓ కొలిక్కి రావడం లేదు. మరికొంతకాలం జాప్యం చేస్తే ఆయా రాష్ట్రాల్లో క్యాడర్ కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. దీంతో పీసీసీల మార్పుపై నాన్చివేత వైఖరికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆయా రాష్ట్రాలకు కొత్త సారథులను నియమించాలని హైకమాండ్ డిసైడ్ అయింది. ఏకాభిప్రాయం కుదిరితే ఏడు రాష్ట్రాలకు రెండు రోజుల్లో పీసీసీ అధ్యక్షులపేర్లను ఖరారు చేస్తారని తెలుస్తోంది. అయితే, విదేశీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ ఉండటంతో..టి.పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది రేపే తేల్చేస్తారా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడి విషయంలో రేవంత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని.. మరోసారి రేవంత్ తో చర్చించి తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ ఎవరనేది ప్రకటించనున్నారని తెలుస్తోంది.