పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ 71, పాక్ 62…!!

పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ 71, పాక్ 62…!!

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పతకాల వేట ముగిసింది.

పతకాల పట్టికలో భారత్,పాక్ దొందూదొందూలా మిగిలాయి.

విశ్వక్రీడాభిమానులను గత రెండువారాలుగా అలరించిన 2024-పారిస్ ఒలింపిక్స్ లో వివిధ దేశాల పతకాల వేట ముగిసింది. ముగింపువేడుకలతో గేమ్స్ కు తెరపడనుంది.

మొత్తం 117 మంది అథ్లెట్లతో 16 రకాల క్రీడాంశాల బరిలో నిలిచిన భారత్ 11 పతకాల లక్ష్యాన్ని చేరుకోడంలో విఫలమయ్యింది. చివరకు 6 పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కనీసం ఒక్క బంగారు పతకమూ సాధించలేకపోయింది. పొరుగుదేశం పాకిస్థాన్ కంటే పతకాల పట్టికలో 8 స్థానాలు దిగువకు పడిపోయింది.

టోక్యోలో అలా…పారిస్ లో ఇలా…!

టోక్యో వేదికగా ముగిసిన 2020 ఒలింపిక్స్ లో అంచనాలకు మించి రాణించిన భారత అథ్లెట్లు ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం తేలిపోయారు. వివిధ క్రీడాంశాలలో పతకం అంచుల వరకూ వచ్చిన భారత అథ్లెట్లు నాలుగో స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కచ్చితంగా పతకాలు సాధించగలరను కొన్న క్రీడాకారులు అదృష్టం కలసిరాక విఫలమయ్యారు. భారత్ మొత్తం ఆరు కాంస్య పతకాలను చేజార్చుకొంది.

స్వర్ణాలు తెస్తారనుకొన్న వినేశ్ పోగట్, నీరజ్ చోప్రాలను దురదృష్టం నీడలా వెంటాడింది. జావలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా చివరకు రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.
షూటింగ్ లో మూడు, హాకీ, కుస్తీ అంశాలలో ఒక్కో కాంస్యం సాధించడంతో భారత్ ఓ రజత, ఐదు కాంస్యాలతో సహా మొత్తం 6 పతకాలతో ..పతకాల పట్టిక 71వ స్థానానికి పడిపోయింది. గత ఒలింపిక్స్ కంటే ఎక్కువ పతకాలు సాధించాలన్న భారత ఒలింపిక్స్ సంఘం లక్ష్యం నెరవేరలేదు.

పిస్టల్ షూటింగ్ లో మను బాకర్ రెండు కాంస్యాలు, రైఫిల్ షూటింగ్ పురుషుల విభాగంలో స్వప్నిల్ కుశాలే, జావలిన్ త్రోలో నీరజ్ రజత, పురుషుల హాకీలో భారతజట్టు కాంస్య, పురుషుల కుస్తీ 57 కిలోల విభాగంలో కాంస్య పతకాలు మాత్రమే భారత్ ఖాతాలో చేరాయి.

పాకిస్థాన్ కంటే వెనుకబడిన భారత్…

పురుషుల జావలిన్ త్రోలో అర్షద్ నదీమ్ సాధించిన రికార్డు బంగారు పతకంతో పాకిస్థాన్ పతకాల పట్టికలో భారత్ కంటే ఎనిమిదిస్థానాల పైన నిలువగలిగింది.
భారత్ ఓ రజతం తో సహా ఆరు పతకాలు సాధించినా..నదీమ్ తెచ్చిన స్వర్ణంతో పాకిస్తాన్ 62వ స్థానంలో నిలిచింది. నదీమ్ 92. 97 మీటర్లతో అరుదైన ఘనత సాధించాడు. 32 సంవత్సరాల విరామం తరువాత ఒలింపిక్స్ లో పాకిస్థాన్ కు పతకం, 40 సంవత్సరాల తరువాత బంగారు పతకం అందించాడు. ఇప్పటి వరకూ హాకీ ద్వారానే బంగారు పతకాలు గెలుచుకొన్న పాకిస్థాన్ కు వ్యక్తిగత విభాగంలో అర్షద్ నదీమ్ మాత్రమే స్వర్ణం అందించిన మొనగాడిగా నిలిచాడు.

ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ కంటే మెరుగైన స్థానంలో నిలవడం పాకిస్థాన్ కు ఇదే మొదటిసారికాదు.

1960, 1968, 1972, 1976, 1984, 1992 ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ ను పాకిస్థాన్ మించిపోగలిగింది.

1960 మెక్సికో ఒలింపిక్స్ పురుషుల హాకీ ఫైనల్లో భారత్ ను కంగు తినిపించడం ద్వారా పాకిస్థాన్ బంగారు పతకం అందుకొంది. కుస్తీలో సైతం పాక్ కు కాంస్య పతకం దక్కింది.

1968 ఒలింపిక్స్ హాకీలో స్వర్ణ, 1972 గేమ్స్ లో రజత, 1976లో కాంస్య పతకాలను పాక్ గెలుచుకోగా..భారత్ విఫలమయ్యింది.

మొత్తం మీద..ఒలింపిక్స్ లో డజన్లకొద్ది రజత, కాంస్య పతకాలు సాధించినా..ఒక్క బంగారు పతకం ముందు దిగదుడుపేనని చెప్పక తప్పదు.