దేశంలో అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా… మోదీ

దేశంలో అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా… మోదీ

కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలు హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. దేశంలో అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నానని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగంలో వ్యాఖ్యానించారు. మహిళా ఉద్యోగుల మెటర్నిటీ సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచామని ఆయన గుర్తు చేశారు. తాము మహిళలను గౌరవించడమే కాకుండా వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రాణాలర్పించిన సమరయోధులకు దేశం రుణపడి ఉంది. భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. స్వాతంత్ర్యం కోసం 40కోట్ల మంది పోరాడారు. ఇప్పుడు మన జనాభా 140కోట్లు. మనం వారి కలలను సాకారం చేయాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి’ అని సూచించారు.

వికసిత్ భారత్ 2047 నినాదం 140 కోట్ల మంది కలల తీర్మానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ‘మనం అనుకుంటే 2047నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. మన దేశాన్ని ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా చేయాలి. తయారీరంగంలో గ్లోబల్ హబ్‌గా మార్చాలి. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి ఎదగాలి. దేశాభివృద్ధికి పాలన, న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరం. అంతరిక్షంలో IND స్పేస్ స్టేషన్ త్వరలో సాకారం కావాలి’ అని పీఎం ఆకాంక్షించారు.