రాజీనామాపై స్పందించిన హరీష్ రావు.
రుణమాఫీ విషయంలో తెలంగాణ కంరేవంత్ రెడ్డి, హరీష్ రావుల మధ్య పార్లమెంటు ఎన్నికల సమయంలో సవాళ్ల పర్వం నడిచిన విషయం తెలిసిందే. రుణమాఫీ అమలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి హరీష్ రావుకి సవాల్ విసిరారు.
“మేము పంద్రాగస్టు నాటికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాము. నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తాడా? నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా? అంటూ రేవంత్ రెడ్డి హరీష్ రావుకి సవాల్ విసిరారు.
ఈ సవాల్ పై హరీష్ రావు కూడా గట్టిగానే స్పందించారు. కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే రాజీనామాకు సిద్ధం అన్నారు. అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ పథకాలన్నీ అమలు చేస్తే తన రాజీనామా లేఖని స్పీకర్ కి సమర్పించాలని జర్నలిస్టులకి ఇచ్చారు. సీఎం కూడా తన రాజీనామా లేఖని పంపాలని డిమాండ్ చేశారు.
అయితే నేడు మరోసారి వీరి సవాళ్ల అంశం చర్చనీయాంశం అయింది. మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల చేసి హరీష్ రావుని రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేయగా… సీఎం వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు.
పంద్రాగస్టు నాటికి రుణమాఫీ మూడు విడతలు…
కాంగ్రెస్ ప్రభుత్వం జులై 15న రుణమాఫీ జీవో జారీ చేసింది. జులై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు రూ.6034.97 కోట్లు విడుదల చేసింది. జులై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది. ఒక లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణమున్న రైతులకు రుణమాఫీ చేసింది. దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ చేసింది. ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మూడో విడత పంట రుణమాఫీని విడుదల చేసింది. మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాల మాఫీకి రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు జమ చేసింది.
హరీష్ రాజీనామా చెయ్…
ఖమ్మం జిల్లా వైరా బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు తిరగకుండానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామన్నారు. “పంద్రాగస్టులోగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఆనాడు మాట ఇచ్చాం. రైతాంగానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కంకణం కట్టుకున్నాం. 27రోజుల్లో 18వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు ఆనాడు సవాల్ చేశారు. హరీష్ రావ్.. నీకు చీము, నెత్తురు ఉంటే రాజీనామా చెయ్. రాజీనామా చేయకపోతే అమర వీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి.. తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పు” అంటూ హరీష్ రావుపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
హరీష్ రావు రియాక్షన్…
అబద్ధం కూడా సిగ్గుపడి మూసి దుంకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన అన్నారు హరీష్ రావు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బీఆర్ఎస్ మీద నామీద అవాకులు చెవాకులు పేలాడని మండిపడ్డారు. “అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి రూ. 40 వేల కోట్లు రైతు రుణ మాఫీ ఏకకాలంలో చేస్తాన్నన్నది రేవంత్ రెడ్డే. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపిండు. ఆగస్టు 15వ తేదీ వరకు రూ. 31 వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికలలో ఊదరగొట్టిండు.. అంటే 9వేల కోట్లు కోత పెట్టిండు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటరా, రూ. 17,869 కోట్లు మాత్రమే అవుతాయా? ఈ ఒక్క విషయంతోనే మీ రుణమాఫీ పచ్చి అబద్ధం అని తేలిపోతున్నది” అంటూ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.