26 కేజీల బంగారంతో బ్యాంకు మేనేజర్ పరార్…!!

కేరళలో ఓ బ్యాంకు మేనేజర్‌ నిర్వాకం బయటపడింది.

ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారంతో ఉడాయించినట్లు వెల్లడైంది. రూ.కోట్లు విలువ చేసే 26 కేజీల బంగారు ఆభరణాలు మాయమైనట్లు వచ్చిన వార్తలతో ఖాతాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సదరు బ్యాంక్‌ మేనేజర్‌ బదిలీ తర్వాత చేపట్టిన సాధారణ తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మేనేజర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కాలక్రమేనా ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

తమిళనాడుకు చెందిన మధు జయకుమార్‌.. కోలికోడ్‌ జిల్లా ఇడోడిలోని ఓ ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేశాడు. ఇటీవల అతడు కొచ్చికి బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో నిర్వహించిన సాధారణ ఆడిట్‌లో భారీ స్థాయిలో బంగారం మాయమైనట్లు వెల్లడైంది. ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారంలో దాదాపు 26 కేజీలు మాయమైనట్లు గుర్తించారు. వీటిని సదరు మేనేజర్‌ తస్కరించుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.