ఫార్మా కాలుష్య కుంపటి…!! 20 వేల ఎకరాల్లో 10 క్లస్టర్లు
సంగారెడ్డిలో 2003… మెదక్‌లో 900 ఎకరాలు.
డప్పూరులోనే 1465 ఎకరాల పంట భూములు మాయం.
ప్రాణాలు పోయినా భూములివ్వబోమంటున్న రైతులు
రెండు పంటలు పండే భూములుపోతే బతికేదెట్ట..
నిమ్జ్ పేర రాని కంపెనీలకు వేల ఎకరాలు లాక్కుండ్రు.
ఇప్పటికే కాలుష్యభూతంలో సంగారెడ్డి జిల్లా…
ఏటా రెండు పంటలు పండే బంగారం లాంటి నల్లరేగడి భూమి మాది. 11 ఎకరాల్లో రెండు బావులు, ఒక బోరు ఉండటంతో పత్తి పండిస్త. పైరు ఏపుగా పెరిగిన సంబరంలో ఉండగా సర్వే అంటూ భూమిలోకి వచ్చిండ్రు. ఇదేమిటని అడిగితే ఇక్కడ కంపెనీలొస్తయి నీ భూమంతా తీసుకుంటరని చెప్పిండ్రు. తరాలుగా భూమే జీవనాధారంగా బతికే మాకు దాన్ని లేకుండా చేస్తే బతికేదెట్ట..? ప్రాణం పోయినా భూమివ్వం. ఎకరం కోటి పలుకుతోంది. రెండు పంటలు పండితే కుటుంబం గడుస్తుంది. ఎవడో కంపెనీ పెడ్తంటే మా భూములెందుకివ్వాలి’ ఇదీ..! డప్పూరుకు చెందిన రైతు బుర్జు అరుణ్‌గౌడ్ ఆవేదన.
పసిడి పంటలు, పాడి పశువులతో ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉన్న పచ్చని పల్లెల్లో ఫార్మా కంపెనీల కాలుష్య కుంపటిని రగిలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. దీనికోసం రెండు పంటలు పండే ఖరీదైన భూముల్ని అప్పనంగా లాగేసుకుంటారన్న వార్తలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే గత పాలకులు లేని కంపెనీలకు నిమ్జ్ పేర వేల ఎకరాల్ని లాక్కున్నారు. మళ్లీ అదే ప్రాంతంలో రెండు వేల ఎకరాల్ని సేకరించేందుకు ప్రస్తుత పాలకులు సర్వే చేపట్టారు. ఇప్పటికే ఫార్మా కంపెనీలు వెదజల్లే కాలుష్యంతో సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రాంత ప్రజలకు ఊపిరాడటం లేదు. తాజాగా జహీరాబాద్ ప్రాంతంలో కంపెనీల పేర మూడూర్లను మింగనున్నారు. సంగారెడ్డి జిల్లాలో 2003, మెదక్ జిల్లాలో 900 ఎకరాల్ని ఫార్మా క్లస్టర్ల కోసం సేకరించాలని అధికారులు ప్రతిపాదించారు. భూముల్ని గుర్తించేందుకు సర్వే చేపట్టారు. ఏండ్ల తరబడి మట్టినే నమ్ముకొని బతుకుతున్న తమను కంపెనీలు పెట్టి వెళ్లగొడితే బతికేదెట్ట..? అని ఆ ప్రాంతాన్ని నవ తెలంగాణ బృందం సందర్శించినప్పుడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
10 ఫార్మా క్లస్టర్లు.. 20 వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 9 జిల్లాల్లో 20 వేల ఎకరాల్ని సేకరించి 10 ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, మేడ్చల్, మల్కాజిగిరి, యాదాద్రిభువనగిరి, నల్లగొండ జిల్లాల్లో ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
విదేశీ పర్యటనలో అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపిన సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కావాల్సిన భూముల్ని సమకూర్చుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ విమనాశ్రయానికి 60 కిలో మీటర్లలోపే భూముల్ని సేకరించే పనిలో అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంóలో భూ సేకరణ షురూ చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 20 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ పెట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఒకే చోట ఫార్మా సిటీ పెడితే వ్యతిరేకత వస్తున్నందున రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 10 క్లస్టర్లు ఏర్పాటు చేయబోతుంది. ఒక క్లస్టర్‌లో మూడు, నాలుగు ఫార్మా విలేజీలుంటాయి. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఇప్పటికే 9 వేల ఎకరాలు అందుబాటులో ఉండగా, నల్లగొండ జిల్లాలో 1300, వికారాబాద్ జిల్లాలో 1373 ఎకరాలు సేకరించనున్నారు. మెదక్ జిల్లాలో 900, సంగారెడ్డి జిల్లాలో మూడు గ్రామాల్లోనే 2003 ఎకరాలు సేకరిస్తున్నారు.
మూడు ఊర్లు.. 2003 ఎకరాలు సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలోని డప్పూర్, వడ్డి, మాల్గి మూడు ఊర్లలో 2003 ఎకరాల్ని సేకరించాలని గుర్తించారు. డప్పూర్‌లోనే 1465.25 ఎకరాలకు గాను ప్రభుత్వ భూమి 491.24 ఎకరాలు, పట్టా భూమి 974.01 ఎకరాలు సేకరిస్తారు. ఊర్లో 450 కుటుంబాలున్నాయి.
3 వేల ఎకరాల భూములుండగా చెర్వు, కుంటలు, వాగులు, గుట్టలు, ఊరు, రోడ్లు పోగా మిగిలింది రెండు వేల ఎకరాలు. ఆ భూమంతా నీటి లభ్యత ఉండటంతో బోర్లు, బావులు తవ్వి పత్తి, చెరకు, కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల్ని పండిస్తున్నారు. రెండు పంటలు పుష్కలంగా పండటంతో రైతులు ప్రశాంతంగా జీవిస్తున్నారు.
ఉన్నట్టుండి పొలాల్లో సర్వేయర్లు దిగడంతో రైతుల్లో దిగులు మొదలైంది. కురుబొద్దీన్, లాల్‌మహ్మద్, నన్నేసాబ్ మూడు కుటుంబాలకున్న 30 ఎకరాలు పోతుంది. జానిపాషకు ఆరు ఎకరాలు, లసుముకొండకున్న 5.10 ఎకరాలు పోనుంది.
భూమి పోతే పిల్లలు బతికేదెట్ల అని నవతెలంగాణ బృందం ఎదుట కన్నీరు పెడుతున్నారు. ఇలా ఆ ఊరిలో ఒక్కరా.. ఇద్దరా.. 200 కుటుంబాలకు చెందిన 93 సర్వే నెంబర్లలో ఉన్న వెయ్యి ఎకరాల పట్టా భూములు పోనున్నాయి. వడ్డీ గ్రామంలోనూ 11 సర్వే నెంబర్లలో ఉన్న 282.13 ఎకరాలకు గాను 220.23 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మరో 61.30 ఎకరాల పట్టా భూముల్ని సేకరిస్తారు.
మాల్గి గ్రామంలోనూ 256.01 ఎకరాలకు గాను 195.10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. మరో 60.31 ఎకరాల పట్టా భూములు పోనున్నాయి. మూడు గ్రామాల్లో కలిపి 1096 ఎకరాల్ని కంపెనీల పేర లాక్కోనున్నారు. మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలంలోని అచ్చంపేటలో 60 నుంచి 86 వరకు, 115,129,130 సర్వే నెంబర్లలో 629 ఎకరాలు, హకీంపేటలోని 12,17,19,20, 95 సర్వే నెంబర్ల నుంచి 150 ఎకరాలు, రామంతాపూర్‌లో 389 సర్వే నెంబర్‌లో 120 ఎకరాల్ని సేకరిస్తున్నారు.
పల్లెల్లో కాలుష్య కుంపటి..
పచ్చని పొలాలు, అడవులతో విరాజిల్లే పల్లెల్లో ఫార్మా కంపెనీలు పెట్టడం వల్ల పర్యావరణం విధ్వంసం అవ్వుద్ది. కంపెనీలు వదిలే కాలుష్య జలాలతో భూగర్బ జలాలు కలుషితమై పంటలే కాదు జీవరాసులూ బతికే పరిస్థితి ఉండదు. విష వాయువుల వల్ల చుట్టూ పాతిక కిలోమీటర్ల వరకు ఊపిరి పీల్చడమే కష్టమవ్వుద్దని పర్యావరణ వేత్తలు అంటున్నారు. సంగారెడ్డి, పటాన్‌చెరు, హత్నూర, జిన్నారం, ఖాజిపల్లిలో నెలకొన్న ఫార్మా కంపెనీల నుంచి నిత్యం వెలువడే వాయు, జల, వ్యర్ధ కాలుష్యంతో ప్రజలు ఊపిరాడక చస్తూ బతుకుతున్నారు. పంటలు సైతం పాడైపోతున్నాయి. తాజాగా న్యాల్‌కల్ మండంలోని డప్పూర్, వడ్డీ, మాల్గి గ్రామాల్లోనూ ఫార్మా కంపెనీలు రాబోతున్నట్టు అధికారిక వర్గాల సమాచారం.
భూములు లాక్కోవద్దంటూ వినతి ఫార్మా కంపెనీల కోసం తమ భూముల్ని లాక్కోవద్దంటూ మూడు ఊర్ల రైతులు తహసీల్దార్‌కు విన్నవించారు. వందలాది మంది రైతులు న్యాల్‌కల్ మండల కేంద్రంలో నిరసన తెలిపారు. ప్రాణంలాంటి భూముల్ని లాక్కుంటే మా ప్రాణం పోయినట్టేనని, మమ్మల్ని చంపి కంపెనీలకు భూములు తీసుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే చేయొద్దంటూ వేడుకున్నారు.
బలవంతపు భూసేకరణ ఆపాలి: రామచంద్రం, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు న్యాల్‌కల్ మండలంలో రెండు వేల ఎకరాల పంట భూముల్ని బలవంతంగా లాక్కోవడం ఆపాలి. ఫార్మా కంపెనీల పేర రైతుల్ని రోడ్డున పడేయొద్దు. ఇప్పటికే నిమ్జ్ పేర వేల ఎకరాల్ని తీసుకున్నారు. మళ్లీ మూడు ఊర్లల్లో రెండు వేల ఎకరాల్ని తీసుకుంటే ఆ ఊర్ల ప్రజలు ఏం చేసి బతకాలి. నిర్వాసితుల పక్షాన సీపీఐ(ఎం) పోరాడుతుంది.
భూముల్ని లాక్కుంటే రైతేం కావాలి భూముల్ని లాక్కుంటే రైతులేం కావాలి. పడావు ప్రభుత్వ భూముల్లో కంపెనీలు పెట్టాలి. పంటలు పండే పట్టా భూముల్ని కంపెనీలకిస్తే రైతులంతా పట్టణాలకెళ్లి కూలీలుగా బతకాల్నా..? మా భూముల్ని అన్యాయంగా తీసుకుంటే సహించం. మాకు భూమే జీవనాధరం. భూమికి భూమి ఇస్తే తప్ప మాకు న్యాయం జరగదు.
భూమి పోతే ఏం చేసి బతకాలి పంట భూములు పోతే మేం ఏం చేసి బతకాలి. రెండు పంటలు పండే భూముల్ని కంపెనీలకు తీసుకోవడం దారుణం. మార్కెట్‌లో ఎకరం ధర కోటి ఉంది. సర్కార్ మొక్కుబడిగా ఇస్తమంటే మేమెట్ల భూమి ఇస్తం. సర్వే పనుల్ని అడ్డుకుంటాం. మా భూముల్లో కంపెనీలు పెట్టి మమ్ముల్ని ఊర్లోంచి వెళ్లగొట్టే కుట్ర సరైంది కాదు.