మంకీపాక్స్‌పై తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్‌

మంకీపాక్స్‌పై తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్‌

కరోనా తర్వాత అంతటి రేంజ్‌లో మంకీ పాక్స్‌ వైరస్‌ వణికిస్తోంది.

ఆఫ్రికా దేశాల్లో హఠాత్తుగా కేసులు పెరిగిపోవడంతోపాటు.. ప్రపంచ దేశాలకు విస్తరిస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే.. మన దేశంలోనూ ఢిల్లీ, కేరళలో కేసులు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సెక్రటేరియట్‌లోని తన కార్యాలయంలో మంకీ పాక్స్‌పై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. సమావేశానికి పలువురు వైద్యశాఖ ఉన్నతాధికారులు హాజరుకాగా.. మంకీ పాక్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. మంకీ పాక్స్‌ వైరస్‌పై ముందస్తు, నివారణ చర్యలకు సంబంధించి అధికారులను ఆరా తీయగా.. దేశంలోని పరిస్థితులను మంత్రికి వివరించారు అధికారులు.

ఢిల్లీ, కేరళలో కేవలం 30 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. అయితే.. మంకీ పాక్స్ నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన మెడికల్ కిట్స్, మందులు, ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు మంత్రి దామోదర రాజనర్సింహ. మంకీ పాక్స్ వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉంచేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మంత్రి దామోదర రాజనర్సింహ. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంకీ పాక్స్ వైరస్‌కు నివారణ మందులు, అవసరమైన కిట్స్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామన్నారు. మొత్తంగా.. మంకీ పాక్స్‌ చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై.. ముందస్తు చర్యలకు సన్నద్ధమైంది.