లై డిటెక్టర్ Vs నార్కో టెస్ట్… ఏమిటీ పరీక్షలు…? నేర పరిశోధనలో ఇవి ఎందుకంత కీలకం…?
దిల్లీ :
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా అతడికి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు కోల్‌కతా హైకోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో అసలు లై డిటెక్టర్ పరీక్ష ఏంటి? నేర పరిశోధనలో లై డిటెక్టర్ (Lie Detector), నార్కో అనాలసిస్ పరీక్షలు (Narco Test) వంటి పరీక్షలు ఎందుకు నిర్వహిస్తారు? ఈ టెస్టుల వల్ల కలిగే ప్రయోజనమేంటో పరిశీలిస్తే..
పాలిగ్రాఫ్ (లై-డిటెక్టర్ టెస్ట్) అంటే..!
పాలిగ్రాఫ్ (Polygraph) టెస్టునే లై డిటెక్టర్ (Lie Detector) అనికూడా పేర్కొంటారు. దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు నిందితులు నిజాలు చెబుతున్నారా లేదా అబద్ధమాడుతున్నారా? అనే విషయాన్ని దీనిద్వారా గుర్తించవచ్చు. ఇందులో ఎటువంటి ఔషధాలు, మత్తు మందులు వినియోగించరు. కేవలం వ్యక్తి శరీరానికి కార్డియో-కఫ్‌లు లేదా తేలికపాటి ఎలక్ట్రోడ్‌లతోపాటు ఇతర పరికరాలు మాత్రమే అమర్చుతారు. వీటితో ఆ వ్యక్తి బీపీ, శ్వాసక్రియ రేటును పర్యవేక్షిస్తారు. నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో వారి శరీరం ఎలా స్పందిస్తుందో వీటివల్ల తెలుసుకోవచ్చు. ఒకవేళ నిందితుడు అబద్ధం చెప్పినప్పుడు అతడి శరీరంలో మార్పులు కనబడతాయి. ముఖ్యంగా బీపీ, శ్వాసక్రియ రేటు మారుతుంది. తద్వారా నిందితుడు చెప్పేది వాస్తవమా..? కాదా? అని వాటికిచ్చిన నంబర్ ఆధారంగా దర్యాప్తు అధికారులు గ్రహిస్తారు. అయితే, ఇందులో వ్యక్తి వాస్తవాలను దాచేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరీక్షను 19వ శతాబ్దంలో ఓ ఇటలీ క్రిమినాలజిస్ట్ తొలిసారి వినియోగించినట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది.
నార్కో అనాలసిస్..
నార్కో అనాలసిస్ (Narco Test) అనేది గ్రీకు పదమైన నార్కో (అనెస్థీషియా అని అర్థం) నుంచి వచ్చింది. ఈ పరీక్షలో భాగంగా వ్యక్తి శరీరంలోకి ఓ ఔషధాన్ని (సోడియం పెంటోథాల్, స్కోపలామైన్,, సోడియం అమైథాల్) ఎక్కిస్తారు. దీన్నే ట్రూత్ సీరం అని కూడా అంటారు. ఆ వ్యక్తి వయసు, ఆరోగ్యం, భౌతిక స్థితి ఆధారంగా ఔషధ డోసును ఇస్తారు. ఇది ఇచ్చిన కొన్ని సెకన్లలోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఈ సమయంలో వ్యక్తి నాడీ వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు. ఆ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలికగా సమాధానాలు వెల్లడిస్తాడు. స్పృహలో ఉన్నప్పుడు చెప్పని విషయాలనూ స్వేచ్ఛగా బహిరంగపరుస్తాడు. ఆ సమయంలో ఆయన పల్స్, బీపీని నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తారు. ఒకవేళ అవి పడిపోతున్నట్లు గ్రహిస్తే.. వెంటనే నిందితుడికి ఆక్సిజన్ అందిస్తారు.
పాలిగ్రాఫ్, నార్కో అనాలసిస్ టెస్టులకు ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి. అతడి అంగీకారం లేకుండా బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్ టెస్టులను నిర్వహించకూడదని సుప్రీం కోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. అయితే, నార్కో అనాలసిస్‌లో వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లను ప్రధాన సాక్ష్యాలుగా కోర్టులు పరిగణించవు.
కేవలం వాటిని ఆధారంగానే తీసుకుంటాయి. ఈ పరీక్షలు నిర్వహించేందుకు మెజిస్ట్రేట్ అనుమతి అవసరం.
గతంలో చాలా కీలకమైన కేసులను ఛేదించడంలో ఈ పద్ధతులను ఉపయోగించారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసు, అబ్దుల్ కరీం తెల్గీ స్టాంపు పేపర్ల కుంభకోణం, 2006లో నోయిడా సీరియల్ మర్డర్స్, 26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో కసబ్ విచారణ సమయంలో నార్కో పరీక్షలు నిర్వహించారు.
అలాగే, 2022లో దిల్లీలో శ్రద్ధా వాకర్‌ను అత్యంత కిరాతకంగా ముక్కలుగా కోసి చంపిన కేసులో ఆఫ్తాబ్కు పాలిగ్రాఫ్ పరీక్ష చేసిన విషయం తెలిసిందే. తాజాగా కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చింది.