రాకండీ అమెరికాకు…! మీరు కన్న కలలు ఛిద్రమవుతాయి… డాలర్ డ్రీమ్స్ పై ఎన్నారై హెచ్చరికలు
అనుకున్నంతగా ఏమీ లేదిక్కడ…! హెచ్1బీ వీసా వెంటపడటమే
గ్రీన్‌కార్డుకు వందేళ్ల వెయిటింగ్!
భారత సంతతి ప్రవాసీల హెచ్చరిక
చదువుయ్యాక నెలకు 2 లక్షల ఖర్చు
తోడుగా ఎడ్యుకేషన్ లోన్ ఈఎంఐలు…మధ్య తరగతికి తడిసి మోపెడే!
దూరం నుంచి కనిపించినంతగా ఉండవు అందరి విదేశీ జీతాలు, జీవితాలు, బ్రతుకుతెరువులు
అదో కలల ప్రపంచం (dream world)! అక్కడి స్వేచ్ఛాయుత జీవితం.. ఒక ఆకర్షణ! హెచ్1 బీ వీసా (H1B visa) ఒక ఆశ! గ్రీన్‌కార్డ్.. (Green card) ఆ కలలకు సాకారం! ఇదీ అమెరికాపై ఒక సగటు విద్యావంత భారతీయు నిరుద్యోగ యువత (unemployed youth) ఆలోచన! తమ అమెరికా కలను నెరవేర్చుకునేందుకు భారతీయ విద్యార్థులు సన్నాహాలు చేసుకునే సమయమిది. అమెరికా యూనివర్సిటీల్లో చదువుకుని, అక్కడే సెటిలయ్యేందుకు టికెట్లు, ఫీజులు, రోజువారీ ఖర్చుల నిమిత్తం భారీగా బ్యాంకు లోన్లు తీసుకుని అమెరికా విమానం ఎక్కుతుంటారు.
కానీ.. అమెరికాలోని భారత సంతతికి చెందిన ఒక ప్రవాసీ మాత్రం.. ఇక్కడికి వస్తే మీ కలలు ఛిద్రమైపోతాయని హెచ్చరిస్తున్నారు. అటువంటి వారికి అమెరికాలోని భారత సంతతి సాఫ్ట్వేర్ డెవలపర్ ఒకరు గట్టి హెచ్చరికలే చేస్తున్నారు. ఆయనకు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నది. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలను ఆయన సునిశితంగా విమర్శిస్తుంటారు. ఆయన చెబుతున్న మాట.. ‘అమెరికాకు రాకండి’! ‘అమెరికాకు రాకండి. ఇవన్నీ అసత్యాలే. నా మాట మీద నమ్మకం కలగడం లేదా? గత దశాబ్దంలో చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిన ఎవరినైనా అడగండి. మీ కలలు ఛిద్రమైపోతాయి. ఇక్కడ మీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మీకు ఇక్కడ భవిష్యత్తు లేదు. మీ కెరీర్ మొత్తం హెచ్1బీ వీసా వెంటపడుతూనే ఉంటుంది. ఇక్కడ పుట్టిన భారతీయులకు గ్రీన్‌కార్డ్ రావాలంటే వేచి ఉండాల్సిన సమయం వందేళ్లపైనే’ అని.. సురేన్ అనే సాఫ్ట్వేర్ డెవలపర్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. భారతదేశంలో రానున్న రోజుల్లో నిర్వహించే ఎడ్యకేషన్యూఎస్ఏ ఫెయిర్లకు రావాలని భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఇటీవల ఆహ్వానం పలకడంపై సురేన్ స్పందించారు. ’80కి పైగా అమెరికా యూనివర్సిటీల ప్రతినిధులను కలుసుకునేందుకు, అడ్మిషన్లు, స్కాలర్షిప్లు, ఇంకా అనేక విషయాలు తెలుసుకునేందుకు ఇది మీకు అవకాశం. అమెరికాలో చదవాలనుకునే మీ కలను నెరవేర్చుకునేందుకు రిజిస్టర్ చేసుకోండి’ అని గార్సెట్టి పిలుపునిచ్చారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ పట్ల భారతీయ ఇమ్మిగ్రెంట్స్‌లో భ్రమలు పటాపంచలవుతున్నాయన్న వాదనల నేపథ్యంలో సురేన్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘నేను ఒప్పుకుంటాను. నేను అమెరికాలోనే ఉన్నాను. 21 ఏళ్ల క్రితం నేను భారత్ నుంచి అమెరికాకు వచ్చాను. ఆ రోజులు వేరు. ఇప్పుడు రాబోయే రెండు దశాబ్దాలు భారతదేశానివి. స్మార్ట్‌గా ఆలోచించేవాళ్లు అమెరికా కంటే భారత్‌లోనే విజయం సాధిస్తారు’ అంటూ గార్సెట్టికి సురేన్ సత్య బదులిచ్చారు. గ్రీన్‌కార్డ్ (జీసీ) కోసం ఎదురుచూపులు అమెరికాలో దయనీయంగా ఉన్నాయని పేర్కొన్నారు. మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఇమ్మిగ్రేషన్ ఇబ్బందులు ప్రత్యేకించి లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌కు ఉన్నాయని చెప్పారు.
కెనాడాకు కూడా రావద్దని ఆయన అన్నారు. ‘అక్కడ మీకు పౌరసత్వం లభిస్తుంది. కానీ.. ఇక్కడ జీవన వ్యయం మీరు భరించలేనంత స్థాయిలో ఉంటుంది. అనేక మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. అక్కడి శాంతి భద్రతల పరిస్థితి మనకు తెలియంది కాదు’ అని సురేన్ పేర్కొన్నారు.
అమెరికాలో ఉంటూనే అమెరికాకు రావద్దని సురేన్ ఎందుకు చెబుతున్నారు…?
అమెరికాలో చదువుకుంటే అక్కడి ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాల రీత్యా మంచి జీవితాన్ని పొందచ్చని, తాము చదివిన చదువుకు భారీ వేతనంతో (high-paying job) కూడిన ఉద్యోగం పొందవచ్చని చాలా మంది భారతీయ విద్యార్థులు భావిస్తుంటారు. అయితే.. వాస్తవాలు చాలా దూరంగా, సంక్లిష్టంగా, సవాలుగా ఉన్నాయని సురేన్ అంటున్నాడు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో చాలా మంది కఠోరమైన హెచ్1బీ వీసా ప్రాసెస్ కోసం ప్రయత్నిస్తారు. ఈ వర్క్ వీసా ఉంటే అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. హెచ్1బీ వీసా అనేది చాలా పోటీతో కూడుకున్నదని (H1B visa is very competitive) పలువురు నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి ఇది అనుభవంలో ఉన్నదేనని అంటున్నారు. ఉన్న వీసాలకంటే దరఖాస్తులు కుప్పలుగా వస్తాయని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ అతి కష్టం మీద వర్క్ వీసా సంపాదించినా.. దానికి ఉన్న తక్కువ ఉపాధి అవకాశాలు, ఎంపాయిమెంట్ స్టేటస్ మారితే వీసా గడువు ముగిసిపోవడం వంటి పరిమితులు వారి కెరీర్‌ను, జీవితాలను నియంత్రిస్తుంటాయని అంటున్నారు.
గ్రీన్‌కార్డులకు వెయిటింగ్ వందేళ్లు…!
అమెరికాలో స్థిరపడినవారికి గ్రీన్‌కార్డులను అక్కడి ప్రభుత్వం ఇస్తుంటుంది. గ్రీన్‌కార్డు లభిస్తే వారు అమెరికా పౌరుల కిందే లెక్క. కానీ.. దీనికీ పరిమితులు ఉన్నాయి. దేశ జనాభాతో, ఆ దేశం నుంచి వచ్చిన దరఖాస్తులతో సంబంధం లేకుండా.. దేశానికి ఏడు శాతానికి గ్రీన్‌కార్డులను అమెరికా ప్రభుత్వం పరిమితం చేసింది. మన దేశం విషయానికి వస్తే.. ఈ లెక్కన ప్రస్తుతం అక్కడ స్థిరపడిన వారు చేసుకున్న దరఖాస్తులకు వందేళ్ల తర్వాత కానీ మోక్షం కలిగే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఏళ్లపాటు అక్కడ ఉద్యోగం చేసినా సొంత ఇల్లు కొనుక్కోవడం గగనమే అవుతుందని అంటున్నారు. ఏళ్లపాటు అక్కడ ఉద్యోగం చేసినా ఒక్కోసారి సొంత ఇల్లు కొనుక్కోవడం గగనమే అవుతుందని అంటున్నారు. ఈ పరిస్థితి వారి వృత్తిపరమైన ఎదుగుదలకే కాకుండా.. వ్యక్తిగత పర్యవసానాలకు కూడా దారి తీస్తుందని చెబుతున్నారు.
నెలకు లక్షన్నర నుంచి రెండు లక్షల ఖర్చు
అమెరికాలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగం దొరికే దాకా సొంత ఖర్చులతోనే (own expenses) బండి నడిపించాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం లక్షన్నర నుంచి గరిష్ఠంగా రెండు లక్షల వరకూ ఖర్చు తేలుతుందని అమెరికాలో ఉంటూ ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న విద్యార్థి తండ్రి ఒకరు చెప్పారు. షేరింగ్‌లో రూమ్ అద్దెకు తీసుకున్నా నెలకు 1000 డాలర్లు కనీసం ఉంటుందని తెలిపారు. ఇక పైఖర్చులు, తిండి, ఉద్యోగాన్వేషణలో తిరుగుడుకు మరో కనీసం మరో వెయ్యి డాలర్ల వరకు ఖర్చవుతుందని అన్నారు. అది అక్కడితో ఆగిపోదని, అమెరికా ప్రయాణానికి, అక్కడ చదువులకు ఫీజులు వంటివాటికి తల్లిదండ్రులు బ్యాంకు రుణాలు తీసుకుంటారని ఆయన చెప్పారు. వారి విద్యాభ్యాసం పూర్తికాగానే వాటి ఈఎంఐ భారం పడుతుందని తెలిపారు. రోజువారీ ఖర్చులకు పంపే డబ్బుకు.. ఇక్కడ కట్టే ఈఎంఐలు (EMI) అదనపు భారంగా పరిణమిస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ ఈఎంఐ కట్టుకుంటూ, అక్కడ పిల్లల రోజువారీ ఖర్చులు సర్దాలంటే తడిసిమోపెడవుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీమంతులకు ఇది కష్టం కాకపోవచ్చుకానీ.. మధ్యతరగతికి మాత్రం పెనుభారమేనని ఆయన స్పష్టం చేశారు. రైతు కుటుంబాలకు మరో ఇబ్బంది కూడా ఉన్నదని ఆయన చెప్పారు. రైతు కుటుంబాలకు తమ పిల్లలను విదేశీ విద్యాభ్యాసానికి పంపాలంటే వ్యవసాయదారులు కనుక ఐటీ కట్టడం లేదనే నెపంతో రుణాలు ఇవ్వరని ఆయన తెలిపారు. దీంతో కొంతమంది ప్రైవేటుగా అప్పులు తెచ్చి దాని బ్యాంకులో పెట్టి అదే ఆదాయంగా చూపి లోన్లు తీసుకుంటారని, రుణమాఫీలో పోతుందని ఆశపడ్డా.. ఐటీ పరిధిలోకి వచ్చిన కారణంగా అవి మాఫీ కాకపోగా.. తలమీద భారం పెరుగుతుందని ఆయన వివరించారు.