ఒకే ఒక్కడు… 2 రాష్ట్రాల ప్రజల పాలిట దేవుడయ్యాడు…!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా రాసానపల్లె ఆయన స్వగ్రామం. స్వతంత్ర్యం రావడానికి ఒక్క ఏడాది ముందు అంటే 1946లో పుట్టారు. పుట్టింది ఓ సాధారణ రైతు కుటుంబంలో. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆపై తమిళనాడులోని సదరన్ స్ట్రక్చర్ కంపెనీలో ఐదేళ్లు ఇంజనీరుగా సేవలందించారు.
ఆ తర్వాత కర్నాటకలోని హోస్పేట్ సమీపంలో తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్ లిమిటెడ్‌లో డిజైన్స్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పని చేశారు. ఆపై మేనేజర్‌గా ప్రమోషన్ పొందారు. సుమారు రెండున్నర దశాబ్దాలకు పైగా అదే సంస్థలో పని చేశారు. అలా భారీ జలాశయాలకు క్రస్ట గేట్ల నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో యంత్రాల అమరిక, భారీ క్రేన్ల డిజైనింగ్ ఇలా అనేక విభాగాల్లో ఆయన ప్రతిభ చూపిస్తూ వచ్చారు. అదే అనుభవం ఇప్పుడు తుంగభద్ర విషయంలోనూ పనికొచ్చింది
పెనుప్రమాదం వేళ.. నేనున్నానంటూ…
1953లో నిర్మించిన తుంగభద్ర డ్యాంకు 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఆగస్టు 10న అర్ధరాత్రి వేళ నీటి ఒత్తిడికి ఓ గేటు కొట్టుకుపోగా.. మరునాడే కన్నయ్యనాయుడు మరమ్మతులకు ముందుకు వచ్చారు. ఈ ప్రాజెక్టుపై ఆపార అనుభవం గడించిన ఆయన తుంగభద్రమ్మ రుణం తీర్చుకుంటానని సంకల్పించారు. కొట్టుకుపోయిన గేటు 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు ఉండగా, దాని స్థానంలో స్టాప్‌లాగ్ ఏర్పాటు చేయించారు. వారం రోజుల ప్రయాస తర్వాత 17న ఆ ప్రక్రియను విజయవంతంగా ముగించారు. వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేసి, అన్నదాతల ఆశలు నిలిపారు