మహిళలపై నేరాల్లో151 మంది MPలు , MLAలు

మహిళలపై నేరాల్లో151 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు

16 మందిపై అత్యాచార కేసులు… అత్యధికం బిజెపి నేతలపైనే

ఢిల్లీ :

మహిళలపై నేరాలను అరికట్టాల్సిన చట్టసభ సభ్యులే ఈ నేరాలకు సంబంధించిన కేసుల్లో చిక్కుకున్నారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బాపతు కూడా వీరిలో ఉన్నారు. 151 మంది ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు.

ఈ ప్రబుద్ధుల్లో 16 మందిపై అత్యాచార కేసులు కూడా ఉన్నాయి. కొల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం జరిపి, హత్య చేసిన దారుణ ఘటనపై దేశవ్యాపితంగా నిరసనాగ్రహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) విడుదలజేసిన తాజా నివేదిక ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలవారీగా చూస్తే ఇటువంటి క్రిమినల్‌ కేసులెదుర్కొంటున్నవారిలో బిజెపిి ఈ కేసులు ఎదుర్కొంటున్న వారిలో 54 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలతో బిజెపి మొదటి స్థానంలో ఉండగా, 24 మందితో కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉంది.

రాష్ట్రాల వారీగా చూస్తే 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఇక్కడ కూడా పశ్చిమ బెంగాల్‌ మొదటి స్థానంలో నిలవగా 21 మందితో ఆంధ్ర ప్రదేశ్‌ రెండో స్థానంలోను, 17 మందితో ఒడిశా మూడవ స్థానంలోను నిలిచాయి. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. 2019 నుంచి 2024 మధ్య ఎన్నికల కమిషన్‌కు ఎంపిలు, ఎమ్మెల్యేలు సమర్పించిన 4,809 అఫిడవిట్లలో 4,693ను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు ఎడిఆర్‌ తెలిపింది.

మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్న 151 మందిలో 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఎడిఆర్‌ వివరించింది. లైంగికదాడి కేసులు ఎదుర్కొంటున్న 16 మందిలో ఇద్దరు సిట్టింగ్‌ ఎంపిలు, 14 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నారని, వీరిపై నేరాలు రుజువైతే పదేళ్లు లేదా జీవిత కారాగార శిక్ష పడే అవకాశం ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది. దీనికి ఎడిఆర్‌ కొన్ని పరిష్కార మార్గాలను కూడా సూచించింది. వాటిలో రాజకీయ పార్టీలు ఇటువంటి నేతలకు టికెట్లు ఇవ్వకూడదని సూచించింది. అలాగే కోర్టు కేసులపై సమగ్ర దర్యాప్తు జరిపించి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో త్వరిత గతిన విచారణ పూర్తి చేయాలని కోరింది. ఇలాంటి నేతలను ఎన్నుకోకుండా ప్రజలు దూరం పెట్టాలని ఓటర్లకు ఎడిఆర్‌ విజ్ఞప్తి చేసింది.